Telangana Politics: కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కూడా హస్తం పార్టీకి అనుకూలంగా ఉండటంతో.. రాష్ట్రంలో త్వరలోనే పూర్వవైభవం రానుందని పొలిటికల్ గా చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో వచ్చే నెల రెండో వారంలో భారీగా చేరికలుంటాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో పొంగులేటి, జూపల్లి చేరేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు వైస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం దిశగా ముందుకెళ్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని ప్రజలకు భావిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. తనను కాంగ్రెస్‌లోకి రావాలని ఇప్పటికే కొందరు నేతలు ఆహ్వానిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తనకు సోనియా, రాహుల్ పై గౌరవం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. కొద్ది రోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపిన ఈటల రాజేందర్.. వారిద్దరు బీజేపీలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ఆ ఇద్దరిని కమలం గూటికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా పలుమార్లు చర్చించగా.. తనకే వారు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకు వారిద్దరిని కాంగ్రెస్‌లో చేరకుండా ఆపగలిగానన్నారు. ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ బలంగా ఉందన్న ఈటల.. బీజేపీలో చేరేందుకు వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత బలం చేసేలా ఉన్నట్లు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉండగా.. హస్తం నేతలు మాత్రం నిజమే మాట్లాడారని అంటున్నారు. అవి తమ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు చొరవ చూపుతున్నా.. మంచిరోజుల కోసం వేచి చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో.. అగ్రనాయకుల సమక్షంలో హస్తం పార్టీలో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనలో ఉండడం, ఆ పర్యటనకు సమన్వయకర్తగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటిస్తుండటంతో వచ్చే నెల తొలివారంలో చేరికలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. మరోవైపు వచ్చే నెల 7న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారత్‌కి తిరిగి వస్తుండటంతో.. 8న ఆ ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి అనుచరుడు మాజీ ఎమ్మెల్యే దయానంద్ కాంగ్రెస్‌లో చేరగా.. అదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
అటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆమె రెండుసార్లు డీకేతో సమావేశం కావడంతో.. కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సాఆర్టీపీ విలీనమైతే పార్టీకి నష్టమని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతుండగా.. మరికొందరు రెడ్లు, క్రిష్టియన్లు, వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందని తద్వారా పార్టీ బలం పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సులభమవుతుందని అంచనా వేస్తున్నారు.