BMC Elections Controversy: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో కొత్త లొల్లి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వేళ్లకు వేసిన సిరా చెరిగిపోతుందని వివాదం చెలరేగింది. వేళ్లకు చెరిపేయగల సిరా వేస్తున్నారని థాకరే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి.
READ ALSO: మహీంద్రా XUV 7XO డెలివరీలు స్టార్ట్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే..?
మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయని గురువారం శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసిన తర్వాత ఓటర్ల వేళ్లకు వేసిన చెరగని సిరాను నెయిల్ పాలిష్ రిమూవర్, శానిటైజర్‌తో సులభంగా తొలగిస్తున్నారని, దీనివల్ల కొంతమంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ పరిస్థితి పాలక మహాయుతి, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ల “కుట్ర”కు నిదర్శనమని చెప్పారు.
ఇదే సమయంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన MNS చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. “గతంలో ఎన్నికల సమయంలో ఉపయోగించిన చెరిగిపోని సిరా స్థానాన్ని కొత్త పెన్నుతో భర్తీ చేస్తున్నారు. ఈ కొత్త పెన్ను గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. మీరు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తే, ఈ సిరా తొలిగిపోతుందని చెప్పారు. అధికారంలో ఉండటానికి ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ఇది చూపిస్తుంది. ఎవరైనా ఇలాంటి మోసం ద్వారా అధికారంలోకి వస్తే, మేము దానిని ఎన్నికలు అని పిలవము, ప్రజలు, శివసేన కార్యకర్తలు, మాతోశ్రీ సేన కార్యకర్తలు వీటన్నింటి గురించి జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని చెప్పారు.
ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో “స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా పోలింగ్” జరిగేలా చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. కొత్త పెన్నుకు బదులుగా చెరగని సిరాను ఉపయోగించారనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సంవత్సరాలుగా ఎన్నికల్లో ఒకే సిరాను ఉపయోగిస్తున్నారు”, అలాగే “నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూస్తున్నారు” అని షిండే తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను. ఈ సిరాను చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నామని వారు నాకు చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా ఎటువంటి మోసపూరిత ఓటింగ్ జరగకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది” అని వెల్లడించారు.
READ ALSO: Grok AI Controversy: గ్రోక్‌ను బికినీ ఫోటోలు అడుగుతున్నారా.. ముసుగేస్తుంది జాగ్రత్తా!