Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదైన కేసులో తదుపరి కార్యాచరణ కోసం పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఆయనను విచారించేందుకు మూడుసార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించిన కాకాణి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.. నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని చోట్ల ఆరా తీస్తున్నారట పోలీసులు..
Read Also: Earthquake: నేపాల్‌లో 5 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన అక్రమ మైనింగ్.. రవాణా.. పేలుడు ప్రాంతాల్లో నిల్వ .. సమీపంలోని గిరిజనులను బెదిరించారనే ఆరోపణలతో… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై దాఖలైన కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. హైదరాబాదులో కుటుంబానికి సంబంధించిన శుభ కార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని చెప్పిన కాకాణి… అనంతరం అందుబాటులో లేకుండా పోయారు. పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ తో పాటు క్వాష్ పిటీషన్ కు సంబంధించి.. విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో వచ్చే తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని ఒకవైపు పోలీసులు భావిస్తుండగా.. మరో వైపు కాకానిని ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో రెండు ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కు పంపించి కాకాణి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నారా? లేదా? ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తే విచారణకు కాకాణి హాజరవుతారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కేసులో కాకాణికి బెయిల్ వస్తే… వెంటనే మరో కేసు లో అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ కేసులో కాకాణికి బెయిల్ వస్తుందా… లేదా పోలీసులు అరెస్టు చేస్తారా? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.