NTV Telugu Site icon

Nellore: నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పెంచిన పోలీసులు

Nellore

Nellore

Nellore: నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు కారాగారం వద్దకు పిన్నెల్లి అనుచరులు తరలివచ్చారు. విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు వెనుదిరిగారు. అన్నీ సవ్యంగా సాగితే రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. నరసరావుపేట నుంచి ప్రత్యేకంగా పోలీసు అధికారులు వచ్చారు. పల్నాడు ప్రాంతం నుంచి పోలీసు అధికారులు రావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు పోలీసులు వచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇతర కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Nadendla Manohar: గ్రామాల అభివృద్ధే గ్రామసభల‌ ముఖ్య ఉద్దేశం

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్‌ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్ పోర్ట్ సమర్పించాలని పిన్నెల్లికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారి దగ్గరకు వారానికి ఒకసారి వెళ్లి సంతకం చేయాలని షరతు విధించింది.50 వేలతో రెండు పూచీ కత్తులు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లొద్దని పిన్నెల్లికి హైకోర్టు ఆదేశించింది. షరతులకు కట్టుబడి ఉంటానని.. బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరగా ఈ మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.