అక్కడ పోలీసులకు కోడి కత్తి గట్టిగా దిగిందా? ఆ నొప్పి భరించలేక, బయటికి చెప్పుకోలేక…. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నారా? ఎమ్మెల్యే సాబ్…. మా నోటికాడ కోడిని లాగేశారంటూ లోలోపల లబలబలాడిపోతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఆ పోలీసులకు వచ్చిన వింత కష్టం ఏంటి? ఎమ్మెల్యే ట్రిమ్మింగ్ అన్న మాట ఎందుకు వినిపిస్తోంది?
Also Read:IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
ఏటా జరిగినట్టే ఈసారి కూడా…. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోళ్ళు గట్టిగానే కూశాయి. పందెం రాయుళ్ళతో బరులు కళకళలాడిపోయాయి. సందడంతా సద్దుమణిగినా….సంగతేంటో తేలక అక్కడ పోలీసులు సతమతం అవుతున్నారట. ఈయన ఎక్కడ దొరికాడ్రా బాబూ…. మనకు అని ఓ ఎమ్మెల్యేని తిట్టుకుంటూ తలబాదుకుంటున్నట్టు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు లోకల్‌గా. ప్రతిసారి చెప్పినట్టే ఈ ఏడాది కూడా… కోడి పందేలకు అనుమతులు లేవు, కేసులు ఉంటాయంటూ గట్టిగానే హడావిడి చేసిన పోలీసులు తర్వాత యధావిధిగా సైలెంట్ అయిపోయారు. ఇక్కడ పందెం నిర్వాహకులు పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులకు ఏటా మామూళ్ళు ఇస్తారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ విషయంలో స్థానిక రాజకీయ నాయకులు కూడా రెండు పక్షాలకు మధ్యవర్తిత్వం వహిస్తారని కూడా చెప్పుకుంటారు.
Also Read:Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
అయితే… ఈసారి కాకినాడ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే ట్రెండ్ మార్చారట. మీరు పోలీసులు, అధికారులు ఎవ్వరికీ పైసా ఇవ్వాల్సిన పనిలేదు. మొత్తం నా దగ్గరకు తీసుకువచ్చేయండని బరుల నిర్వాహకులకు ఆదేశాలిచ్చి…. అంతా తన దగ్గరికి రప్పించుకున్నారట. ఆమేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు… ఇలా ప్రతి విభాగంలో ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్కచెప్పి మరీ నిర్వాహకులు ఎమ్మెల్యేకి డబ్బు ముట్టజెప్పి వచ్చినట్టు తెలిసింది. కానీ… ఆ తర్వాతే అసలు కథ మొదలైందంటున్నారు. ప్రతి బరి నుంచి ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసి స్టేషన్‌కి ఇంత, ఫలానా ఆఫీస్‌కి, ఆఫీసర్‌కి ఇంత అని డివైడ్ చేసేశారు, దానికి అనుగుణంగా పందేలు కూడా సాఫీగా జరిగిపోయాయి. ఇటు పోలీస్, ఇటు రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా పండగ మూడు రోజులు మాకేం కనపడలేదు, వినపడలేదన్నట్టుగానే వ్యవహరించారు. అసలంటూ పెట్టాలి కాబట్టి… ఏవో కొన్ని కేసులు బుక్ చేసి చచ్చిన కోళ్ళను తెచ్చి, కొందరి మీద నామమాత్రపు కేసులతో సరిపెట్టేశారు.
ఇది ఏటా తంతే కాబట్టి అంతా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కానీ… పండగ అయిపోయింది. గెలిచిన పుంజులు వెళ్లిపోయాయి, ఓడినవి కోసకోళ్ళ రూపంలో కూరై అరిగిపోయాయి కూడా. అయినా సరే…. మాకు రావాల్సిన మామూళ్ళు మాత్రం ఇంతవరకు అందలేదని అధికారులు తెగ ఫీలైపోతున్నట్టు తెలిసింది. పందేలు ముగిసి 15 రోజులు గడిచినా…. మాట్లాడుకున్న వాటాలుఇంకా అందలేదేంటని నిర్వాహకుల్ని అడుగుతుంటే…. వాళ్ళు మాత్రం అప్పడే మొత్తం ఎమ్మెల్యేకి అప్పగించేశాం. ఇక ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకోండంటూ చేతులెత్తేస్తున్నారట. దీంతో పోలీస్, రెవెన్యూ ఆఫీసర్స్ ఇరకాటంలో పడ్డారు. ఆ మామూళ్ళ సంగతేంటని డైరెక్ట్‌గా సదరు ఎమ్మెల్యే సాబ్‌ని అడగలేదు, అలాగని చూస్తూ చూస్తూ…. ఏటా వచ్చే పై ఆదాయాన్ని ఇప్పుడు వదులుకోలేరు. దాంతో…. కాకినాడ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో అధికారులకు మనసు మనసులో ఉండటం లేదన్నది లోకల్ టాక్.
ఇక లాభం లేదనుకుని మీరే కలెక్ట్ చేసి మా డబ్బులు మాకు అప్పగించేయండని బరుల నిర్వాహకుల్ని వత్తిడి చేస్తున్నా….. వాళ్లేమో ఈ కతలన్నీ మాకొద్దు. మీ లెక్కలన్నీ ఎమ్మెల్యేనే తేలుస్తానని చెప్పారంటూ క్లారిటీ ఇచ్చేశారట. సంక్రాంతి టైంలో సాధారణంగా కింది స్థాయి నుంచి పై లెవల్ ఆఫీసర్ వరకు ఎవరి రేంజ్‌లో వాళ్ళు వెళ్ళాల్సింది వెళ్తుందన్నది విస్తృత ప్రచారం. ఈ క్రమంలో మిగతా నియోజకవర్గాల నుంచి జిల్లా స్థాయి ఆఫీసర్స్‌కు చేరాల్సింది చేరిపోయిందట.. కానీ ఆ ఒక్క నియోజకవర్గం నుంచి రాలేదేంటని వాళ్ళు సైతం ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం అటు ఎమ్మెల్యేని అడగలేక, ఇటు తమ ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, పందెం రాయుళ్ల దగ్గర నుంచి వసూలు చేసే మార్గం కానరాక పాపం… తెగ అవస్థలు పడుతున్నారట.
Also Read:YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
ఈ ఫ్రస్ట్రేషన్‌లో కొందరు బరస్ట్ అవుతున్నారు. నిరుడు పోస్టింగ్స్ టైంలోఎమ్మెల్యేకి ఇవ్వాల్సింది ఇచ్చేశాం. మళ్లీ ఇప్పుడు తగుదునమ్మా అంటూ… మాకు వచ్చే ఆదాయానికి కోతేయడం ఏంటంటూ… అక్కడక్కడా బయటపడుతున్నట్టు సమాచారం. మిగతా చోట్ల అంతా బానే ఉంది. మా దగ్గరే ఈ కక్కుర్తి అంటూ కుండ బద్దలు కొట్టేస్తున్నారట. ఇంకొందరైతే…ఈసారి పండక్కి కోసలు తప్ప మిగిలిందేం లేదంటూ నిట్టూరుస్తున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం అధికారులకు వెళ్ళాల్సిన ఆమ్యామ్యాలను ఎమ్మెల్యే తన దగ్గరే పెట్టుకుని ఆడేసుకుంటున్నారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. పాపం పోలీసులు, అన్నీ పాత బాకీల కింద జమైపోతాయంటూ చమత్కరించే వారు కూడా పెరుగుతున్నారు కాకినాడ పరిసరాల్లో.
