PM SVANidhi Scheme: ఆధార్‌ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు

500 Rupee Notes

500 Rupee Notes

PM SVANidhi Scheme: చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2020 జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం ద్వారా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తీవ్రంగా నష్టపోయిన చిన్న వ్యాపారులకు ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. పీఎం స్వనిధి పథకం ఆరేళ్ల పూర్తి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు అందడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో వారికి కొత్త అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఈ పథకం నమ్మకం, సాధికారత అనే రెండు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉందని మోడీ తెలిపారు.

చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ మూలధనం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఈ పథకం ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని 2030 వరకు పొడిగించడమే కాకుండా, రుణ పరిమితిని రూ.80 వేల నుంచి రూ.90 వేలకు పెంచింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి తాకట్టు లేదా హామీ లేకుండానే రుణం అందించడం. రుణాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా పంపిణీ చేస్తారు. మొదటి విడతలో రూ.15,000, రెండో విడతలో రూ.25,000, మూడో విడతలో రూ.50,000 వరకు రుణం అందుతుంది. అయితే ప్రతి విడత రుణాన్ని నిర్ణీత గడువులో చెల్లించిన తర్వాతే తదుపరి విడత మంజూరు అవుతుంది.

×
×
Ad

మొదటి విడతగా తీసుకున్న రూ.15 వేల రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతగా రూ.25 వేల రుణం లభిస్తుంది. ఆ మొత్తాన్ని కూడా సమయానికి చెల్లిస్తే మూడో విడతలో రూ.50 వేల రుణం మంజూరు అవుతుంది. ఈ విధంగా మొత్తం రూ.90 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణం పొందే అవకాశం ఉంటుంది. పీఎం స్వనిధి పథకం కింద రుణం పొందడానికి పెద్దగా పత్రాలు అవసరం ఉండవు. ప్రధానంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే రుణాన్ని చిన్న చిన్న ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించే సౌలభ్యం కూడా కల్పించారు.

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సమీపంలోని ప్రభుత్వ బ్యాంకును సంప్రదించవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపి, ఆధార్ కార్డు కాపీతో పాటు అవసరమైన వివరాలను సమర్పిస్తే బ్యాంకు పరిశీలన అనంతరం రుణాన్ని మంజూరు చేస్తుంది. చిన్న వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ఒక ఆర్థిక బలంగా మారిందని, భవిష్యత్తులో మరింత మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.