NTV Telugu Site icon

Special Millet Lunch: పార్లమెంట్‌లో ప్రత్యేక మిల్లెట్ లంచ్.. ఖర్గేతో కలిసి ఆస్వాదించిన ప్రధాని

Millet Lunch

Millet Lunch

Special Millet Lunch in Parliament: అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం(మిల్లెట్ ఇయర్) 2023ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌ ఏర్పాటు చేసిన లంచ్‌లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆనందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భోజనం చేస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పక్కన వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూర్చున్నారు. ఈ తృణధాన్యాల భోజనం( మిల్లెట్ లంచ్) గురించి ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్‌ ఇయర్‌గా సిద్ధమవుతున్న తరుణంలో, పార్లమెంట్‌లో మిల్లెట్ వంటకాలు వడ్డించే విలాసవంతమైన మధ్యాహ్న భోజనానికి హాజరయ్యామన్నారు. పార్టీలకు అతీతంగా ఈ భోజనంలో పాల్గొనడం బాగుందన్నారు.

తాము రోటీ, జ్వార్ బజ్రా, రాగులతో తయారు చేసిన స్వీట్‌లతో సహా రుచికరమైన వంటకాలను తయారు చేసామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి చెఫ్‌లను రప్పించామన్నారు. ప్రధాని ఇక్కడ తన భోజనాన్ని నిజంగా ఆస్వాదించినందుకు తాను చాలా సంతోషించాననని ఆమె చెప్పారు. ఈ రోజు తయారుచేసిన రుచికరమైన వంటకాల్లో మిల్లెట్, రాగి దోస, రాగి రోటీ, జోవర్ రోటీ, హల్దీ సబ్జీ, బజ్రా, చుర్మాతో చేసిన ఖిచ్డీ ఉన్నాయి. తీపి రుచికరమైన వాటిలో బజ్రా ఖీర్, బజ్రా కేక్ కూడా ఉన్నాయి.

Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదు

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్ 2023 వేడుకలపై ఉద్ఘాటించారు. మిల్లెట్ ద్వారా కొనసాగుతున్న పోషకాహార ప్రచారాన్ని ప్రోత్సహించడానికి మార్గాలను సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం ఏప్రిల్ 2018లో మిల్లెట్‌ను పోషకమైన తృణధాన్యంగా నోటిఫై చేసింది. పోషన్ మిషన్ ప్రచారంలో మిల్లెట్‌ కూడా చేర్చబడింది.

జాతీయ ఆహార భద్రతా మిషన్ (NFMS) కింద 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో మిల్లెట్లతో తయారు చేయబడిన పోషకాహారంగా అందజేయపడుతోంది. భారతదేశం, నైజర్, సూడాన్, నైజీరియా మిల్లెట్ ప్రధాన ఉత్పత్తిదారులు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తృణధాన్యాల పంట జాతులను పండిస్తాయి. గత 5 సంవత్సరాలలో, మన దేశం 2020-21లో అత్యధిక ఉత్పత్తితో 13.71 నుండి 18 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ మిల్లెట్‌ను ఉత్పత్తి చేసింది.