PM Modi: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఎన్టీవీ- భక్టి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి న రచన టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచన చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. భక్తులతో పాటు గోవింద నామస్మరణ ప్రధాని మోడీ చేశారు. గోవింద నామస్మరణతో కోటి దీపోత్సవ ప్రాంగణం మార్మోగింది. భక్తులతో పాటు ప్రధాని మోడీ కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కోటి దీపోత్సవ ఉత్సవాల గురించి ప్రధాని మోడీ ప్రసంగించారు. అనంతరం ప్రధాని తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. ఇల కైలాసాన ఆదిదేవుడికి ప్రధాని మోడీ హారతి ఇచ్చారు.
Read Also: PM Modi: భాగ్యనరంలో ప్రధాని మోదీ రోడ్ షో.. కాసేపట్లో కోటి దీపోత్సవానికి హాజరు
ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆ దేవుడి దీవెనలతో తాను ఈ రోజు ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు. .ఈ రోజు కాశీలో దీపోత్సవం జరుగుతోందని.. తాను ఇక్కడ దీపోత్సవంలో పాల్గొంటున్నానని చెప్పారు. ఈ రోజు తిరుమల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగిందని, శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. గుర్‌ద్వార్‌ను కూడా దర్శించే భాగ్యం కలిగిందన్నారు. తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానన్న ప్రధాని మోడీ.. కానీ ఇది చాలా ప్రత్యేకమైనదనన్నారు. కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులకు శుభాభినందనలు తెలిపారు. శ్రీశైలం నుంచి వేములవాడ వరకు, భద్రాద్రి నుంచి అలంపూర్ వరకు ఆధ్యాత్మికత వెళ్లివిరుస్తుందన్నారు ప్రధాని మోడీ.
పోతన, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అతి శ్లోకానుసారం దీపమే దైవమని ప్రధాని తెలిపారు. దీపజ్యోతి మనకు వెలుగు రేఖలను అందిస్తుంది, చీకట్లను తొలగిస్తుందన్నారు. ఆ రోజు అయోధ్యకు రాముడు తిరిగివచ్చినందుకు, శివుడు భూమిపైకి వచ్చిన గుర్తుగా మనం దీపం వెలిగిస్తామని చెప్పారు. ఈ రోజు దీపాలకు మరో ప్రత్యేకత ఉందన్న ఆయన.. ఈ దీపాలు ఆత్మనిర్భర్ భారత్‌ను సూచిస్తాయని.. వికసిత భారత్‌ను ప్రతిబింబిస్తాయన్నారు. కాశీ, ఉజ్జయిని ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దామని.. త్వరలోనే అయోధ్యలో ఆలయాన్ని ప్రారంభించుకోనున్నామన్నారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. కోటి దీపోత్సవంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ దీపాలు వెలిగిద్దామని భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. బతుకమ్మ, బోనాల పండుగను జాతీయ పండుగగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని చెప్పారు.