PM Narendra Modi Net Worth: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్నగర్‌లో జన్మించిన మోడీ, స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ, 2014 మేలో దేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ఆస్తుల విషయానికి వస్తే.. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్న అఫిడవిట్ ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.3 కోట్లకు పైగా ఉంది. మోడీకి చెందిన చర ఆస్తుల మొత్తం విలువ రూ.3,02,06,889. ఇందులో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లే. వాటి విలువ రూ.2.85 కోట్లకు పైగా ఉంది. ఇతర ఆస్తుల విషయానికి వస్తే, 45 గ్రాముల బరువున్న నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి అంచనా విలువ రూ.2.67 లక్షలు. నగదు రూపంలో రూ.52,920 ఉంది. జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్లు రూ.9.12 లక్షల విలువ కలిగి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు కింద రూ.3.33 లక్షలు చూపించారు. స్థిరాస్తులు లేవు. అంటే భూములు, ఇళ్లు లేదా ఇతర ఆస్తులు ఆయన పేరుపై లేవన్న మాట. అఫిడవిట్‌లో ఆయన భార్యగా జశోదాబెన్ పేరు ఉంది. అయితే ఆమె వద్ద ఉన్న ఆస్తుల వివరాలు ‘తెలియదు’ అని నమోదు చేశారు.
READ MORE: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!
నరేంద్ర దామోదరదాస్ మోడీ రాజకీయ ప్రస్థానం ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రారంభమైంది. 1985లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన క్రమంగా పార్టీ నాయకత్వంలో కీలక స్థానానికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత దేశవ్యాప్తంగా నాయకుడిగా ఎదిగి, వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ప్రస్తుతం వారణాసి ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. ప్రధానమంత్రిగా మోడీ అనేక కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలు కూడా ఆయన పాలనలోనే జరిగాయి. సాధారణ కుటుంబంలో పుట్టిన మోడీ చిన్నతనంలో వడ్నగర్ రైల్వే స్టేషన్ వద్ద తండ్రి నడిపే టీ స్టాల్‌లో సహాయం చేసినట్టు చెప్పుకుంటారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందినప్పటికీ, ఇప్పటికీ ఆయన సాధారణ జీవనశైలికే ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం.