NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’ను దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోడీ

Pm Modi On Black Paper

Pm Modi On Black Paper

PM Modi: గత పదేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన బ్లాక్‌ పేపర్‌ను ‘దిష్టిచుక్క’గా అభివర్ణించారు. ప్రతిపక్షాల అటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించిందని అన్నారు.బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రతిపాదించిన ‘శ్వేతపత్రం’కు వ్యతిరేకంగా ఖర్గే ‘బ్లాక్ పేపర్’ను విడుదల చేశారు. కేంద్రం ఆర్థిక వ్యవస్థపై విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలు వంటి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం వైఫల్యాలను ‘బ్లాక్ పేపర్’ హైలైట్ చేస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ‘బ్లాక్‌ పేపర్‌’ విడుదల చేసిన కొద్దిసేపటికే, ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీ ఈ చర్య తమ ప్రభుత్వానికి ‘దిష్టిచుక్క’ లాంటిదని, చెడు దృష్టిని పారదోలుతుందని అన్నారు.

Read Also: PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ‘శ్వేతపత్రం’కు కౌంటర్‌గా కాంగ్రెస్‌ ఈ ఉదయం ‘బ్లాక్‌ పేపర్‌’ ప్రచురించింది. 2014 వరకు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం అని శ్వేతపత్రం ప్రవేశపెడతామని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ చర్య వెనుక ఉన్న ఏకైక లక్ష్యం, “ఆ సంవత్సరాల దుర్వినియోగం నుండి పాఠాలు నేర్చుకోవడమే” అని ఆమె అన్నారు.

ఈ ఉదయం బ్లాక్ పేపర్‌ను విడుదల చేసిన ఖర్గే మాట్లాడుతూ.. “ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఎప్పుడూ చెప్పదు. వారు MGNREGA నిధులు విడుదల చేస్తున్నారు. కానీ వారు రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారు” అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతకర్తలు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై కేంద్రం చేసిన దాడికి కౌంటర్ ఇస్తూ.. ‘ఈరోజు మీరు పాలిస్తున్నారు, ఈరోజు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అధిక నిరుద్యోగం, ఆర్థిక విపత్తులు, నోట్ల రద్దు, లోపభూయిష్ట GST వంటివి ఉన్నాయి. ఇవి ధనిక, పేదల మధ్య విభజనను మాత్రమే పెంచాయి. మిలియన్ల మంది రైతులు, రోజువారీ కూలీ కార్మికుల భవిష్యత్తును నాశనం చేశాయని బ్లాక్‌ పేపర్‌ పేర్కొంది.