Site icon NTV Telugu

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మైసూరులో ప్రధాని ఆసనాలు

Pm Modi In Yoga Day 2022

Pm Modi In Yoga Day 2022

అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్​ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్‌లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై యోగాసనాలు వేశారు.

మైసూర్ భారత్‌కు ఆధ్యాత్మిక కేంద్రమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక యోగా అని ఆయన అభివర్ణించారు. ఒకప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యోగాసనాలు వేసేవారని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారన్నారు. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉందన్నారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యమన్నారు. సూర్యుని కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ఆరోగ్యం.. శ్రేయ‌స్సు కోసం ప్రజ‌లు యోగాను త‌ప్పకుండా ఆచ‌రించాల‌ని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులు నేటి త‌రంలో పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగింద‌న్నారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శ్వాస వ్యవస్థకు సంబంధించి వ్యాయామం కూడా అని ప్రధాని వివరించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగాని సులభంగా చేసుకోవచ్చని తెలిపారు. దీన్ని చేయడానికి ఒక చాప, కొంచెం స్థలం ఉంటే చాలు. యోగాను ఇంట్లోనే చేసుకోవచ్చు. పనిలో.. విరామం సమయంలోనూ చేసుకోవచ్చని చెప్పారు ప్రధాని మోదీ. ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువద్దామ‌ని పిలుపు నిచ్చారు.

International Yoga Day: విజయవంతం చేయాలని ప్రధాని పిలుపు

Exit mobile version