Narendra Modi: రాజస్థాన్‌లో రూ.17 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెగిటివ్ ఆలోచనలతో ఉండే కాంగ్రెస్, పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఈ కారణంగానే కరెంట్ విషయంలో కాంగ్రెస్ అపఖ్యాతి మూటగట్టుకుంది అని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వల్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల గంటల కొద్దీ అంధకారం ఉండేది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరెంట్ కొరత ఉంటే ఏ దేశం అభివృద్ది సాధించలేదు.. ఇక, కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించలేదు.. రోడ్డు మ్యాప్ గురించి ఆలోచించలేదు అని ప్రధాని తెలిపారు. కాగా, ప్రగతిశీల ఆలోచనలతో సానుకూల విధానాలు రూపొందించలేకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్య అని ప్రధాని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అంధకారం నుంచి బయటపడేశామని ఆయన పేర్కొన్నారు.