PM Modi slams Opposition over Parliament Ruckus: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని, అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ‘ఇండియా కూటమి’ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వ్యవహారశైలిపై ఎంపీలతో చర్చించారు.
‘పార్లమెంట్‌లో జరిగిన భద్రతా ఉల్లంఘనను ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలి. కానీ ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రవర్తనతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వారి సీట్ల సంఖ్య మరింత తగ్గుతుంది. అదే సమయంలో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైంది. అందుకే పార్లమెంట్ నిర్వహణకు వారు అడ్డుపడుతున్నారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ఇండియా కూటమి చూస్తోంది’ అని ప్రధాని ఎంపీలతో వ్యాఖ్యానించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Also Read: IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టాలు తప్పవా?
పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారని ప్రహ్లాద్ జోషి చెప్పారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మర్యాదపూర్వకంగా స్పందించాలని ఎంపీలకు మోడీ సూచించారట. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు సరిహద్దు గ్రామాల్లో పర్యటించాలని ప్రధాని కోరినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని సోమవారం ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే.