PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనను ఆమోదించడమే కాకుండా, ఈ విజయంతో బెంగాల్లో విజయం కోసం నినాదాలు కూడా చేశారని అన్నారు. ఈ వేదిక నుంచి పశ్చిమ బెంగాల్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ.. “బీహార్‌లో విజయం బెంగాల్‌కు మార్గం సుగమం చేసింది. అక్కడ కూడా అడవి రాజ్యాన్ని కూల్చివేస్తాము” అని ప్రధాని అన్నారు.
ప్రధాని మాట్లాడుతూ.. “గంగా నది బీహార్ నుంచి బెంగాల్‌కు ప్రవహిస్తుంది. బెంగాల్లో బీజేపీ విజయానికి బీహార్ మార్గం సుగమం చేసింది. బెంగాల్‌లోని సోదరులు, సోదరీమణులకు నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. ఇప్పుడు మనం అక్కడ కూడా జంగిల్ రాజ్యాన్ని పెకిలిస్తాం” అని ప్రధాని మోడీ అన్నారు. బీహార్ ప్రజలు భయం, భీభత్సం, అవినీతి, జంగిల్ రాజ్యాన్ని తిరస్కరించినట్లే, బెంగాల్ ప్రజలు కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల కృషి, రాష్ట్ర ప్రజల విశ్వాసంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు కచ్చితంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
బెంగాల్ విజయానికి బీజేపీ ప్లాన్ ఏమిటి?
పశ్చిమ బెంగాల్లో విజయం కోసం బీజేపీ కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన చొరబాటుదారులు బెంగాల్‌కు వచ్చి స్థానిక ప్రజల జీవనోపాధిని లాక్కుంటున్నారని బీజేపీ స్థానిక ప్రజలకు చెబుతోంది. అదే విధంగా అవినీతి, దోపిడీ, హింస వంటి అంశాలను దూకుడుగా లేవనెత్తడం ద్వారా బీజేపీ – టీఎంసీ బలహీనతలను లక్ష్యంగా చేసుకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర బెంగాల్, జంగల్‌మహల్ వంటి బలమైన ప్రాంతాలలో మరింత బలోపేతం కావడం, ప్రత్యేకంగా మహిళలు, యువ ఓటర్లపై దృష్టి పెట్టడం కూడా బీజేపీ వ్యూహంలో భాగం అని అంటున్నారు. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
బీహార్ విజయాన్ని పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో ముడిపెడుతూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ విజయం బెంగాల్లో బీజేపీ మద్దతును పెంచుతుందని, అక్కడి ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. “బెంగాల్ ప్రజలతో కలిసి బీజేపీ రాష్ట్రంలోని జంగిల్ రాజ్‌ను పెకిలించివేస్తుందని నేను హామీ ఇస్తున్నాను” అని ప్రధాని పునరుద్ఘాటించారు. ఇది మమత బెనర్జీకి ఆందోళన కలిగించే విషయం.. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కూడా SIR నిర్వహిస్తున్నారు. దీంతో బీహార్‌లో మాదిరిగానే పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లు బెంగాల్లో కూడా తొలగిస్తారని చెబుతున్నారు.
READ ALSO: Nitish Kumar: విమర్శలు కాదు… నితీష్ కుమార్ విజయాలను చూడండి..