NTV Telugu Site icon

PM Modi: ఉగ్రవాదులు భారత్‌ను భయ పెట్టలేరు.. ఎందుకంటే..

Pm Modi

Pm Modi

ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు. ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోడీ అన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను వీక్షించిన ఆయన ఆ ఘటనపై స్పందించారు. ‘‘ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్‌లో చూశాను. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు. ప్రజలు సురక్షితంగా లేరని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు. భయంభయంగా బతుకుతున్నారు. ఇక, వారు మనల్ని భయపెట్టలేరు’’ అని ఆయన అన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు..
అనంతరం మోడీ తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉందని అన్నారు. ‘ప్రజల కోసం, ప్రజలచే అభివృద్ధి’ అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యమన్నారు. తాము ప్రజా ప్రయోజనాల దిశలో మాత్రమే పయణిస్తున్నామన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం, భారతీయులు తమ నమ్మకాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని పూర్తి చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, పుకార్లను కూడా ఆయన ప్రస్తావించారు.

యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి..
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి కొరవడిందని, అయితే గత 10 ఏళ్లలో ఇది పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో 1.25 లక్షలకు పైగా నమోదైన స్టార్టప్‌లు ఉన్నాయని, మన యువత దేశం గర్వించేలా చేయాలని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్యం, ఉపాధి కల్పన పథకాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. “మన దేశంలో మరుగుదొడ్లు నిర్మించాలనే ప్రచారం ప్రారంభించబడింది. ఈ పథకం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే కాకుండా ఉపాధిని సృష్టించడం, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడింది. ఈ పథకం గౌరవం, భద్రతను అందిస్తుంది.” అని తెలిపారు.

Show comments