PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..

Pm Modi Naxalism

Pm Modi Naxalism

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో నక్సలిజం, మావోయిజంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా దేశ భద్రతకు, ప్రగతికి సవాలుగా మారిన నక్సల్స్ తుపాకీ సంస్కృతి ముగింపు దశకు చేరుకుందని స్పష్టం చేస్తూనే, సమాజంలో తిష్టవేసిన మరింత ప్రమాదకరమైన వర్గం గురించి దేశాన్ని హెచ్చరించారు. గతంలో అనేక సంవత్సరాల పాటు మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ అధికార వర్గాల్లో చోటు దక్కించుకున్నారని, చివరికి ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా చేరుతూ దేశ విధానాలనే ప్రభావితం చేశారని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల్లో తుపాకులు చేతబట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలో మన భద్రతా బలగాలు విజయం సాధించినప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లో తిష్టవేసిన ‘అర్బన్ నక్సల్స్’ (దిమాగీ నక్సల్స్) ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. హింస, అరాచకాల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు వీరు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారని, ఇలాంటి వారిని సమాజం గుర్తించి పూర్తిగా దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.

యువతను ఈ విచ్ఛిన్నకర శక్తుల బారిన పడకుండా కాపాడుకుని, వారిని వికసిత్ భారత్ సాధించే దిశగా మళ్లించడం మనందరి బాధ్యత అని ప్రధాని నొక్కిచెప్పారు. సరిహద్దుల లోపలి నుంచి వచ్చే ముప్పు అయినా, విదేశీ సరిహద్దుల వెలుపల నుంచి ఎదురయ్యే సవాలైనా ఎదుర్కొనేందుకు భారత్ సదా సిద్ధంగా ఉందన్నారు. ఈ 21వ శతాబ్దంలో దశాబ్దాల నాటి పాత సవాళ్లకు స్వస్తి పలకడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని వ్యాఖ్యానించారు. నక్సలిజం, మావోయిజం నాలుగు దశాబ్దాల పాటు అనేక లక్షల మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయని, ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిల్చి తల్లిదండ్రుల కలలను కల్లలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ నీడలో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన ఈ హింసాత్మక సంస్కృతిని అణచివేసే క్రమంలో 3,500 మందికి పైగా భద్రతా బలగాలు ప్రాణాలు అర్పించారని, ఇది యుద్ధంలో జరిగే ప్రాణనష్టం కంటే తక్కువేమీ కాదని గుర్తుచేశారు. 2014లో దేశ ప్రజలు తమకు అధికారం ఇచ్చేనాటికే నక్సలిజం రహిత భారత్‌ను నిర్మించాలని గట్టి సంకల్పం తీసుకున్నామని మోడీ తెలిపారు. దశాబ్దాలుగా రక్తాన్ని చిందించిన ఆ నేలపై నేడు వికాసం, నమ్మకం, నూతనోత్సాహాలతో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని హర్షం వ్యక్తం చేశారు. నక్సల్స్ ఊపిరి త్రిప్పుకోలేని స్థితికి చేరుకున్నప్పటికీ, ఈ సవాలును ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని, సురక్షిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.