NTV Telugu Site icon

PM Modi: రాహుల్ గాంధీ, ఖర్గేను కలిసి మోడీ.. కీలక అంశంపై చర్చ!

Modi

Modi

బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తదుపరి ఛైర్మన్ ఎంపికపై చర్చించేందుకు ప్రధాని మోడీ ఇద్దరు కాంగ్రెస్ నేతలను కలిశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు. రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా మొత్తం ప్రతిపక్షానికి ఖర్గే నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముఖ్యమైన నియామకాన్ని పర్యవేక్షించే ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీలో ఈ ఇద్దరు నేతలు కూడా ఉన్నారు.

READ MORE: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?

ఇదిలా ఉండగా… డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో దేశ ప్రజలు చూశారు. గత కొన్నేళ్ల పాటు కాంగ్రెస్‌ కొనసాగించిన అరాచకాలు, ముఖ్యంగా అంబేడ్కర్‌ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్ధాలతో వారు దాచలేరు. అలా అనుకుంటే వారు పెద్ద పొరబాటు చేసినట్లే. దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను ఎప్పటికి ఈ దేశ ప్రజలు మర్చిపోరు. మనం ఇలా ఉండటానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కరే కారణం. గత దశాబ్దకాలంగా అంబేడ్కర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు మా సర్కార్ అవిశ్రాంతంగా కృషి చేసింది.” అని మోడీ పేర్కొన్నారు.

Show comments