NTV Telugu Site icon

PM Modi-Aman Sehrawat: ‘మీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది’.. అమన్తో ఫోన్లో ప్రధాని

Modi

Modi

కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. ‘నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది’ అని అమన్తో ప్రధాని అన్నారు. శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అమన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో అమన్ 13-5 తేడాతో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించాడు.

ప్రధాని అమన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘మీకు చాలా అభినందనలు, మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు’. అని తెలిపారు. మీరు మీ పేరును యావత్ దేశం హృదయాల్లో నింపారన్నారు. ఛత్రసాల్ స్టేడియంను తమ ఇల్లుగా మార్చుకునే ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.. కానీ మీరు దానిని మీ ఇల్లుగా మార్చుకున్నారని పేర్కొన్నారు. మీ జీవితం దేశప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని మోడీ తెలిపారు. ఒలింపిక్స్‌లో పతకం తెస్తున్న అతి పిన్న వయస్కుడివి.. మీకు చాలా భవిష్యత్ ఉంది. మీరు దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని నమ్ముతున్నానని ప్రధాని పేర్కొన్నారు. నీ జీవితంలో చాలా కష్టపడ్డావు.. మీ తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత కూడా ఏ మాత్రం బెదరలేదన్నారు. మీ జీవితం చాలా స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.

COVID-19 warning: కరోనాపై డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్.. దేశాలకు అలర్ట్ జారీ

మరోవైపు.. అమన్ మాట్లాడుతూ, 2028లో బంగారు పతకం సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మోడీ మాట్లాడుతూ.. మీరు స్వర్ణం సాధిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ ఒలింపిక్స్లో దేశప్రజలు బంగారు పతకం సాధిస్తావని అందరూ భావించారు.. కానీ అది సాధ్యపడలేదు. కానీ 2028లో తప్పకుండా సాధిస్తావని ప్రధాని అమన్‌కు చెప్పారు. ఇప్పుడు సాధించింది కాంస్యమా, రజతమా, బంగారు పతకమా అని చూడకు.. నువ్వు ఆ చింతను విడిచిపెట్టు అని మోడీ తెలిపారు. మీరు దేశానికి చాలా ఇచ్చారు.. దేశప్రజలందరూ గర్వంగా ఉన్నారన్నారు. అమన్ మాట్లాడుతూ.. దేశానికి తాను ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. అమన్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. ఈ కల ఉన్నవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ప్రధాని మోడీ చెప్పారు.

పారిస్ క్రీడల్లో భారత్ కు ఇప్పటి వరకు ఆరో పతకాలు వచ్చాయి. అందులో ఐదు కాంస్యం, ఒక రజతం సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అమన్ ఏకైక పురుష రెజ్లర్. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి భారత్‌ ప్రతి ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో పతకాలు సాధిస్తూ వస్తోంది. 2008లో సుశీల్ కుమార్ కాంస్యం, 2012లో సుశీల్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం, 2016లో సాక్షి మాలిక్ కాంస్యం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా రజతం, బజరంగ్ పునియా కాంస్యం సాధించారు.

Show comments