NTV Telugu Site icon

PM Modi: 2047 నాటికి ‘వికసిత భారత్‌’ మనందరి లక్ష్యం

Pm Modi

Pm Modi

PM Modi: దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు. అప్పుడు ఉన్న 40 కోట్ల మంది దేశానికి స్వతంత్రాన్ని సాధిస్తే.. ఇప్పుడు 140 కోట్ల మంది ఎంత సాధించవచ్చో ఆలోచించాలన్నారు. ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read Also: Independence Day 2024: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు.. జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని.. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలని ఆకాంక్షించారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్‌ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’ నినాదం 140 కోట్ల మంది కలల తీర్మానమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహమని ప్రధాని పేర్కొన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పు తెచ్చిందన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని తెలిపారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 15 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకుపోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తయారీ రంగంలో భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా మారాలన్నారు. . ప్రపంచంలోనే భారత్‌ ఇప్పుడు శక్తవంతంగా మారిందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైతే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదన్నారు. భారత్‌ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలన్నారు.

భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని.. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని.. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. భారత్‌ త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్నారు. స్వయం సహాయక రంగాలకు ఇప్పటివరకు 9 లక్షల కోట్లు రుణాలిచ్చామని.. కోటిమంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని స్పష్టం చేశారు.