NTV Telugu Site icon

PM Narendra Modi: జీ20 వేదికగా పీఎం మోడీ సుదీర్ఘ ప్రసంగం.. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పిలుపు

Pm Modi In G20 Summit

Pm Modi In G20 Summit

PM Narendra Modi: ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్‌ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని మరోసారి అలాంటి ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా దేశాధినేతల సమక్షంలో జీ20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్‌ను ఆలింగనం చేసుకున్న మోదీ కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు.

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ, దౌత్య మార్గాన్ని తిరిగి తీసుకురావడానికి మనమంతా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం.. ప్రపంచంలో పెను విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత శాంతిని నెలకొల్పేందుకు అప్పటి ప్రపంచ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. వాతావరణ మార్పు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌లో పరిణామాలు, వీటితో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్యలు. ఇవన్నీ కలిపి ప్రపంచ వినాశనానికి కారణమయ్యాయి. దీంతో ప్రపంచలోని సరఫరా వ్యవస్థలో సంబంధాలు తెగిపోయాయన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సంక్షోభం ఉందని ఆయన చెప్పారు. అందుకే మనమంతా ఏకమవ్వాలని దేశాధినేతలకు ప్రధాని పిలుపునిచ్చారు.

అనంతరం ఆహారం, ఇంధనంపై జరిగిన సదస్సులో ప్రసంగించిన మోదీ కరోనా సంక్షోభం తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరి భుజాలపై ఉందని దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రవాణా గొలుసు వ్యవస్థ శిథిలావస్థలో ఉందని నిత్యావసర వస్తువుల సంక్షోభం ప్రతి దేశంలో సవాలు విసురుతుందన్నారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌ పరిణామాలు ప్రపంచంలో విధ్వంసం సృష్టించాయని.. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

Shraddha Case: కేసులో షాకింగ్ ట్విస్టులు.. ఫ్రిజ్‌లో శవం పెట్టి, మరో యువతితో రొమాన్స్

ఉక్రెయిన్‌ -రష్యాల మధ్య యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ చమురు, గ్యాస్ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. సవాళ్లతో కూడిన జీ 20 సదస్సుకు నాయకత్వం వహించినందుకు ఇండోనేషియాను ప్రధాని మోడీ అభినందించారు. 2030 నాటికి భారత్​లో సరఫరా అయ్యే విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయనున్నామని తెలిపారు. ఈ సదస్సు ముగింపు వేడుకల్లో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలను ప్రధాని మోడీకి అప్పగించనున్నారు. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆ కూటమి సదస్సుకు హాజరవ్వాల్సిందిగా సభ్యదేశాల నేతలను నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.