Site icon NTV Telugu

Gujarat Elections: గుజరాత్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. డైమండ్ సిటీలో నేడు ప్రధాని మోడీ, కేజ్రీవాల్

Gujarat Elections

Gujarat Elections

Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పలు పార్టీలకు చెందిన నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు అగ్రనేతల ప్రచారంతో గుజరాత్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కిది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ డైమండ్‌ సిటీ సూరత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సూరత్ సాంప్రదాయకంగా అధికార బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. వ్యాపార కేంద్రంగా ఉన్న సూరత్‌ అనేక రంగాలతో సంబంధం ఉన్న లక్షలాది మంది వ్యక్తులతో పాటు వస్త్ర, వజ్రాల వ్యాపారులు పార్టీకి మద్దతు ఇస్తున్నారు. విమానాశ్రయం నుండి ర్యాలీ వేదిక వరకు 25 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత సూరత్‌లోని మోటా వరచాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని బీజేపీ తెలిపింది.

ప్రధానమంత్రి భరూచ్ జిల్లాలోని నేత్రంగ్, ఖేడా జిల్లాలోని మెహమదాబాద్‌లో కూడా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సూరత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వస్త్ర పరిశ్రమ నాయకులతో పాటు రత్నాల కళాకారులతో టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు యోగి చౌక్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేజ్రీవాల్ కతర్గాంలో రోడ్‌షో నిర్వహిస్తారని ఆప్ తెలిపింది.

ప్రతిసారీ భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోటీగా ఉండే గుజరాత్‌ ఎన్నికలు ఈసారి ఆమ్‌ ఆద్మీపార్టీ బలంగా అడుగు పెట్టడంతో త్రిముఖంగా మారాయి. 2017 ఎన్నికల్లోనూ పాల్గొన్నా.. అప్పుడు డిపాజిట్లు కూడా దక్కని ‘ఆప్‌’ ఐదేళ్లలో బలం పుంజుకుంది. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి భాజపా తర్వాత స్థానాల్లో నిల్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈసారి బలమైన శక్తిగా ఎదుగుతామని సంకేతాలిస్తోంది.రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచీ గుజరాత్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు తప్పిస్తే మరో పార్టీకి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో.. దిల్లీ నుంచి కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ దూసుకు వస్తుండటం భాజపా, కాంగ్రెస్‌లకు కొరుకుడు పడని అంశం! దిల్లీ, పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ తన సత్తా నిరూపించుకుంది. ఆకర్షణీయమైన హామీలు, పాలనతో ప్రజలను ఆకట్టుకుంది. ఆ ఊపుతోనే గుజరాత్‌పైనా కేజ్రీవాల్‌ సేన కన్నేసి తన సర్వశక్తులనూ ఒడ్డుతోంది.

CM KCR: డిసెంబరు 1 నుంచి ప్రజల్లోకి ముఖ్యమంత్రి..

గుజరాత్‌ను వరుసగా ఏడోసారి గెల్చుకోవాలని చూస్తున్న బీజేపీ తొలుత ఆప్‌కు గుజరాత్‌లో అవకాశమే లేదని కొట్టి పారేసింది. ఆప్‌పై విమర్శలు గుప్పించింది. దిల్లీ నుంచి మాయమాటలు చెప్పేవాళ్లు వస్తున్నారంటూ ప్రధాని మోడీ సైతం ఆరోపించారు. కానీ లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌.. పాత పింఛను పథకంలాంటి తాయిలాలతో కేజ్రీవాల్‌ పార్టీ ప్రచారంలో ముందడుగు వేయటంతో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రత్యర్థుల విషయంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆప్‌తో పోటీ పడి మాట్లాడటం; కేజ్రీవాల్‌ వేసే ప్రశ్నలకు సమాధానాలివ్వటం ఆపేసింది. అంతేగాకుండా.. టీవీల్లో చర్చలకు కూడా ఆప్‌ ప్రతినిధి వస్తే తమ ప్రతినిధులెవ్వరూ హాజరు కానివ్వకుండా చూస్తోంది. మొత్తానికి.. తమ కంచుకోటలోకి దూసుకు రావాలని ప్రయత్నిస్తున్న ఆప్‌ను కావాలని విస్మరిస్తోంది. అసలు ఆప్‌ అనేదే పోటీలో లేనట్లు, అలాంటి పేరే విననట్లు వ్యవహరిస్తోంది. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనంటూ కమలనాథులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మరోవైపు, ఆప్‌ రాకతో అయోమయంగా మారిన కాంగ్రెస్‌ కూడా బీజేపీ బాటనే పట్టడం విశేషం. టీవీ ఛానళ్లలో చర్చలకు ఆప్‌ ప్రతినిధి ఉంటే వాటిని కాంగ్రెస్‌ బహిష్కరించడానికే ప్రాధాన్యమిస్తోంది.

Exit mobile version