NTV Telugu Site icon

Union Cabinet: కేబినెట్ నిర్ణయాలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. అంతా గోప్యమే!

Pm Modi

Pm Modi

Union Cabinet: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్‌లో ఏయే నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతీ ఇరానీ, జైశంకర్‌, పీయూష్‌ గోయల్‌, గడ్కరీ, తోమర్‌ పాల్గొన్నారు. కేబినెట్‌ భేటీ కంటే ముందు పలువురు మంత్రులు కీలక సమావేశాలు జరిపారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.

Also Read: New Parliament: సమయం దాటితే మైక్‌ కట్‌.. కొత్త పార్లమెంట్‌లో ఆటోమేటెడ్ సిస్టమ్!

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం సాగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పాటు ఓబీసీ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో ఎనిమిది బిల్లులపై చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023, పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు 2023, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లు, SC/ST ఆర్డర్‌కు సంబంధించిన మూడు బిల్లులపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని అంచనా వేయబడింది.

పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ‘వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌’ బిల్లు, ఇండియాకు భారత్‌గా పేరు మార్చే సంభావ్య తీర్మానం అనే రెండు అంశాలు చర్చకు రానున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రేపు రెండు రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 22 వరకు కొనసాగనున్నాయి. మంగళవారం పార్లమెంట్ కార్యకలాపాలు నూతన భవనంలో జరగనున్నాయి.

Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ

రేపు ఉదయం 9.30 కు ఫోటో సెషన్ కార్యక్రమం జరగనుంది. 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఎంపీల సమావేశం ఉండనుంది. మంగళవారం నుంచి పార్లమెంట్‌ నూతన భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు ప్రధాని మోడీ ఎంపీలందరితో కలిసి కొత్త పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. రేపు ఎంపీలకు గిఫ్ట్‌ బ్యాగ్ అందించననున్నారు. గిఫ్ట్ బ్యాగ్‌లో రాజ్యాంగము బుక్, పార్లమెంట్ పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపు ఉండనున్నట్లు తెలిసింది. లోక్‌సభ మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు సమావేశం కానుండగా.. రాజ్యసభ 2.15 గంటలకు పార్లమెంట్‌ నూతన భవనంలో సమావేశం కానుంది. మిగిలిన నాలుగు రోజుల పాటు కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేక సమావేశాలకు వేదిక కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో “బిజినెస్ అడ్వైజరీ కమిటీ” సమావేశం జరగనుంది. పాత భవనంలో “బిజినెస్ అడ్వైజరీ కమిటీ” సమావేశం జరగనున్నట్లు సమాచారం.

Show comments