వారిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకునేందుకు సహోద్యోగి ప్రాణాలే తీశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో చోటుచేసుకుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌లో (Triangle Love) ఒకరి ప్రాణాలు పోగా.. ఇంకొకరు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
ఒకే కంపెనీలో పని చేస్తు్న్న మహిళను ఇద్దరు అబ్బాయిలు అనీష్, మహేశ్ ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిపై అనీష్ విపరీతమైన ప్రేమను పెట్టుకున్నాడు. కానీ అదే అమ్మాయిని మహేశ్ కూడా ప్రేమించడం జీర్ణించుకోలేకపోయాడు. అంతే ఆగస్టు 28, 2023న మహేశ్‌ను అత్యంత దారుణంగా అనీష్ చంపేశాడు. మొత్తానికి ముక్కోణపు ప్రేమ సహోద్యోగి హత్యతో ముగిసినట్లుగా ఖాకీలు తేల్చారు. ఈ మేరకు ఛార్జిషీటు దాఖలు చేశారు. నేరం నుంచి తప్పించుకునేందుకు అనీష్ శతవిధాలా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదని తేల్చారు.
నిందితుడు అనీష్‌పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరం చేయడానికి నెలల తరబడి అనీష్ ప్లాన్ చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. పక్కాప్లాన్‌తోనే మహేశ్‌ను హతమార్చినట్లుగా వెల్లడించారు. MTS ఉద్యోగాలు ఇప్పిస్తానని మహేష్‌ని అనిష్ నమ్మించి మోసం చేశాడు. ఈ సర్వీస్ కోసం అనీష్‌కు మహేష్ రూ.9 లక్షలు చెల్లించాడు. ఇక మహేశ్‌ను చంపేశాక.. అతడి ఫోన్లు మాయం చేయడంతో పాటు వాట్సాప్ చాటింగ్ అంతా అనీష్ డిలీట్ చేశాడు.
హత్య, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలను పోలీసులు ఛార్జిషీట్‌లో తేల్చారు. అనీష్‌ను ప్రాథమిక నిందితుడిగా పేర్కొన్నారు. 40 మందికి పైగా వ్యక్తులను విచారించగా.. వారిద్దరూ ఒకే మహిళను ఇష్టపడినట్లు తేలిందన్నారు. దీంతో మహేష్‌పై అనీష్ పగ పెంచుకున్నాడని తేలిందని నివేదికలో పొందిపరిచారు.
మహేశ్ హత్యకు ముందు అనిష్ మూడు రోజుల సెలవు తీసుకొని హర్యానాలోని గోహనాకు వెళ్లాడు. అక్కడ అతను ఇద్దరు స్నేహితులను కలుసుకున్నాడు. మెడికల్ లీవ్‌లో ఉన్నానని.. అయితే హర్యానాలో ఒకరి నుంచి డబ్బు వసూలు చేయాలని చెప్పాడు. అనీష్ తన ఫోన్‌ను ఇంట్లో ఉంచి.. మరో స్నేహితుడి నంబర్‌ను ఉపయోగించాడు.
ఇక హత్య జరిగిన రోజు ఉద్యోగం విషయంపై చర్చించేందుకు అనిష్‌ను ఆర్‌కే పురంలోని తన ఫ్లాట్‌కు రావాలని మహేశ్ పిలిచాడు. ల్యాప్‌టాప్ చూస్తూ పరధ్యానంలో ఉండగా మహేష్‌ను అనీష్ రాడ్డుతో తలపై కొట్టాడు. అనంతరం మహేష్ ముఖాన్ని పాలిథిన్‌లో చుట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. చనిపోయేంత వరకూ కొట్టడం ప్రారంభించాడు. చనిపోయాక.. మరో సహోద్యోగి ప్లాట్‌లో మహేశ్‌ను ఖననం చేశాడు. ఇక మహేశ్‌కు చెందిన వస్తువులను అనీష్ వివిధ ప్రదేశాల్లో పడేశాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అనీష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదని పోలీసులు నివేదికలో తేల్చారు.