Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!

Pithapuram

Pithapuram

Janasena vs Janasena: కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జనసేనలో రాజకీయ వేడిని రాజేసింది. వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీలోనే తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మెజారిటీ కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలో జనసేన నేతలు, కౌన్సిలర్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఏ చక్రిపై దాడి చేయడం కలకలం రేపింది.

వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై విభేదాలు
పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా.. కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వరరావు పేరును పార్టీ ప్రకటించింది. దీంతో మెజారిటీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వెంకటేశ్వరరావు జనసేనలో చేరారని, మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న సంధ్యకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఎంపీ పీఏపై జనసేన నేతల దాడి
ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఏ చక్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంపీ పీఏ చక్రి అక్కడి నుంచి కారులో బయటకు వెళ్లిపోయారు. మొత్తంగా పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక జనసేనలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. పార్టీ నిర్ణయాన్ని సొంత పార్టీ కౌన్సిలర్లే వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.