Pithapuram: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు…పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది. అధికారంలోకి వచ్చిన తరవాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని దొరబాబుకు వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమా స్టార్, రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి పదవుల కోసం ప్రశ్నించడానికే వచ్చానని చాలా సార్లు బహిరంగంగా చెప్పారు. పవన్‌ను ఓడించేందుకు అందరూ కలిసి మెలిసి ఉండేలా, అసమ్మతి లేకుండా వైసీపీ ప్రయత్నిస్తోంది. బుధవారం కూడా వైసీపీ నేతలు సీఎం జగన్‌ను కలిశారు. కొంత మంది ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి దొరబాబును ఆహ్వానించలేదు. ఈ క్రమంలోనే ఆయన కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎంవో నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
Read Also: Manchu Manoj: పవన్ కే ఓటు వేయండి.. నేను అలా అనలేదు
మరోవైపు గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తుండటంతో అటు వైసీపీ అధినేత జగన్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే పవన్ కల్యాణ్‌పై పై చేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌పై మహిళను రంగంలోకి దింపి తానేంటో నిరూపించుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను రంగంలోకి దింపుతున్నారు. అయితే దొరబాబును వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో అసమ్మతి వినిపించకుండా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబును బుజ్జగించి వంగా గీతకు సహకరించే విధంగా ఆయనను ఒప్పించినట్లు తెలిసింది. ఈ భేటీలో వంగా గీత వర్గంతో సమన్వయం చేసుకునేలా దొరబాబును ఒప్పించారు. మరోవైపు పార్టీలో చేరికలకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడంపైనా సీఎం జగన్ ఆరా తీశారు. వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్గాలు కలిసి పని చేయాలని సీఎం జగన్ సూచించారు.