Pilli Subhash vs Venugopala Krishna: రామచంద్రాపురం పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన మధ్య వార్‌ను..పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఒక వైపు ఎంపీ బోస్ వర్గం వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ వేణుకు ఇస్తే ఓడిస్తామంటూ తీర్మానం చేశారు. మరోవైపు మంత్రి వర్గం కూడా ఈ పరిణామాల పై అసహనాన్ని ప్రదర్శించింది. బోస్ సన్నిహితుడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోలమూరి శివాజీపై దాడికి పాల్పడింది. మనస్తాపానికి గురైన శివాజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడ్ని నిలబెట్టాలని పిల్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తానే అభ్యర్థినని మంత్రి వేణు బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో…తాడేపల్లి నుంచి ఎంపీ పిల్లి సుభాష్‌కు పిలుపొచ్చింది. ముందుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డితో సమావేశం అయ్యారు. మంత్రి వేణుపై పిల్లి ఫిర్యాదు చేశారు. అటు మంత్రి వేణు కూడా సజ్జలకు ఫోన్‌లో బోస్ పై ఫిర్యాదు చేశారు.
పోటాపోటీగా చేస్తున్న ఈ గొడవలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగారు. సుభాష్ చంద్రబోస్‌ను పిలిచి మాట్లాడారు. కుమారుడి కోసం గొడవలు ఎందుకు పడుతున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మీ అబ్బాయి భవిష్యత్తుకు నాది భరోసా…ఇలా రోడ్డున పడితే పార్టీ డ్యామేజ్ అవుతుందని సీరియస్గానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండీ, రాష్ట్ర స్థాయిలో పార్టీ గెలుపు కోసం పని చేయాల్సిన వ్యక్తి…ఇలా చిన్న చిన్న విషయాల్లో ఘర్షణలకు దిగటం సరైంది కాదని సుతి మెత్తగా తలంటినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదని జగన్ హెచ్చరించినట్లు సమాచారం. మిగిలిన విషయాలను గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎమ్పీ మిథున్ రెడ్డి చూసుకుంటారని చెప్పినట్లు తెలుస్తోంది.
వచ్చే వారం మంత్రి చెల్లుబోయిన వేణుకు కూడా పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఈ వివాదాలకు సంబంధించి మీడియాలోకి ఎక్కవద్దని, కొద్ది రోజుల పాటు మౌనంగా ఎవరి పని వారు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అందుకే సీఎంతో భేటీ అనంతరం మిథున్ రెడ్డితో కలిసి బోస్ మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. నియోజకవర్గం విషయంలోనూ ఇదే రకంగా సీఎం జగన్ ఆదేశాలను ఎంపీ పాటిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.