NTV Telugu Site icon

Pilli Subhash Chandra Bose: వైసీపీకి బిగ్‌ షాక్..! జగనసేన గూటికి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌..?

Pilli Subhash

Pilli Subhash

Pilli Subhash Chandra Bose: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తప్పదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే కాగా.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఈ పంచాయితీ.. పార్టీ అధిష్టానం, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వరకు కూడా వెళ్లింది.. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారు.. ఇంకా ఎన్ని సీట్లు గెలిపించాలి అనేదిపై ఫోకస్‌ పెట్టాలి.. కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలపై పట్టుపట్టుకూడదు.. మీ కుమారుడి సీటు వ్యవహారం నేను చూసుకోనా? అంటూ తనను కలిసిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తో సీఎం వైఎస్‌ జగన్‌ తేల్చిచెప్పారు.. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ బహిరంగంగా ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. అధిష్టానం బుజ్జగించినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలోనే ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారని.. జనసేనలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది..

మొత్తంగా.. వైసీపీకి పిల్లి బోస్‌ గుడ్‌బై చెబుతారనే చర్చ జోరుగా సాగుతోంది.. ఇదే సమయంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట బోస్‌.. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో పిల్లి బోస్‌ ఉన్నారని తెలుస్తోంది.. కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్‌కు జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయనకు జనసేన టికెట్ ఖరారు చేశారనే వార్త కూడా హల్‌చల్‌ చేస్తోంది.. తాను పట్టుపడుతోన్న రామచంద్రాపురం నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారట పిల్లి సూర్య ప్రకాష్‌.. ఈ మేరకు జనసేనలోకి వెళ్ళేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగుతోంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రామచంద్రాపురం నియోజకవర్గం టికెట్ వచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో.. వైసీపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోగా.. పిల్లి సుభాష్‌, ఆయన కుమారుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అధికారిక ప్రకటన ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, పిల్లి సుభాష్‌ చంద్రబోస్ సీనియర్ రాజకీయ నేత. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.. వైఎస్ మరణానంతరం.. వైఎస్‌ జగన్ తో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన ప్రయాణం వైసీపీలో సాఫీగానే సాగుతూ వచ్చింది.. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన సీఎం జగన్‌.. మంత్రిగా కూడా బాధ్యతలు అప్పజెప్పారు.. ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు. ఇంతవరకూ బాగానే ఉ న్నా.. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన కుటుంబానికి రామచంద్రాపురం అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఈ సీనియర్‌ నేత పట్టుబడుతున్నారు.. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కాదని టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం, సీఎం జగన్‌ సిద్ధంగా లేరని చర్చల ద్వారా తేలిపోయిందట.. దీంతో, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్.. ఇప్పుడు ఆయన కుమారుడితో కలిసి జనసేన పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.