Philippines Protests 2025: నిజంగా నేపాల్ నిరసనలు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఈ నిరసనలతో ప్రపంచంలోని చాలా దేశాల యువత ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. నేపాల్ నిరసనల ప్రభావంతో ఇండోనేషియాలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దీంతో ఆ దేశంలోని ఎంపీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇటీవల లండన్ వీధుల్లోకి వేలాదిగా జనాలు వచ్చి వలసలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సంఘటనలు మరువక ముందే.. తాజాగా మరో దేశం ఈ నిరసనల జాబితాలో చేరింది. అదే ఫిలిప్పీన్స్.. ఇంతకీ ఫిలిప్పీన్స్‌లో ఏం జరుగుతుంది.. ఈ నిరసనలు ఎక్కడికి దారి తీయనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Vijay Deverakonda: మౌళి నువ్వు నీలాగే ఉండు. ఎవరి సలహాలు వినకు !
సెప్టెంబర్ 21..
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ 21వ తేదీన లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి రానున్నారు. దేశ ప్రజలు ఈ నిరసనలకు ట్రిలియన్ పెసో మార్చ్ అని పేరు పెట్టారు. ఈ నిరసన ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలికి వ్యతిరేకంగా జరుగనున్నట్లు సమాచారం. ఫిలిప్పీన్స్‌లో ప్రజల ఆగ్రహం కేవలం అవినీతి గురించి మాత్రమే కాదు, దాని ఫలితంగా ఏర్పడిన మానవ విషాదం గురించి కూడా అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల దేశంలో సంభవించిన వరదలు మొత్తం దేశాన్ని నాశనం చేశాయి. రాజధానిలోని వీధులు ఏకంగా నదులను తలపించాయి. వరదల్లో ప్రజలు గంటల తరబడి చిక్కుకుపోయారు, లేక్కలేనన్ని వాహనాలు కొట్టుకుపోయాయి.
దేశంలో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. మురికి నీరు, ఎలుకల ద్వారా కాలేయానికి తీవ్రమైన హాని కలిగించే లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. ప్రతి నెలా ప్రజల నుంచి పన్నుల పేరుతో వసూలు చేసే డబ్బును ఆకస్మిక వరదల నుంచి రక్షించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఖర్చు చేయడం లేదా అని సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వరద నియంత్రణ ప్రాజెక్టులలో బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ, వాస్తవ ఫలితాలు మాత్రం శూన్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం..
ఫిలిప్పీన్స్‌లో ఈ ఉద్యమం ముందు సోషల్ మీడియాలో రాకుంది. టిక్‌టాక్, ఫేస్బుక్, ట్విట్టర్లలో, రాజకీయ నాయకులను మొసళ్లు అని పిలుస్తూ.. మీమ్స్ వైరల్ అయ్యాయి. అలాగే వారి అవినీతిని చిత్రీకరించే AI వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ దేశంలోని ప్రజలు ముఖ్యంగా “నెపో బేబీస్” లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు లగ్జరీ కార్లు, డిజైనర్ దుస్తులు, ఖరీదైన బ్యాగులు, వారి ప్రయాణాల ఫోటోలు.. సాధారణ ప్రజలల్లో ఆగ్రహ జ్వాలలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఆదివారం జరగనున్న భారీ నిరసన ప్రదర్శనను ట్రిలియన్ పెసో మార్చ్ అని పిలుస్తున్నారు.
ఇటీవల ఆ దేశంలో 2023 వాతావరణ, వరద నియంత్రణ ప్రాజెక్టులపై జరిగిన ఆడిట్లో సుమారు $17.6 బిలియన్లు లేదా సుమారు ₹1.4 ట్రిలియన్లు అవినీతి కారణంగా నష్టపోయానట్లు నివేదికలు బయటికి వచ్చాయి. ఈ నివేదికలు ప్రజాగ్రహాన్ని మరింత పెంచింది. వరద నియంత్రణ ప్రాజెక్టులకు ఖర్చు చేయాల్సిన నిధులలో దాదాపు 70 శాతం కుంభకోణాలలో అదృశ్యమయ్యాయని నివేదిక పేర్కొంది. దేశంలోని అనేక ఆనకట్టలు, రిటైనింగ్ గోడలు నేలపై కాకుండా కాగితాలపై మాత్రమే ఉన్నాయని తేటతెల్లం అయ్యింది. ఈ కుంభకోణంతో దేశ అధ్యక్షుడి సన్నిహితుడు, పార్లమెంట్ స్పీకర్ మార్టిన్ రోమల్డెజ్ రాజీనామా చేయవలసి వచ్చే స్థాయికి చేరుకుంది. ఈ కుంభకోణంలో అనేక మంది ఎంపీలు, కాంట్రాక్టర్లు లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
సెప్టెంబర్ 21 ప్రత్యేకత..
నిరసనకారులు సెప్టెంబర్ 21ని ఏదో మామూలుగా ఎంచుకోలేదు. 1972లో అప్పటి దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ మార్షల్ లా విధించిన తేదీ ఇది. ఆ నియంతృత్వం, అవినీతి చివరికి 1986లో ఒక భారీ ప్రజా ఉద్యమం ద్వారా ఆయనను పదవీ నుంచి దిగిపోయేలా చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే దేశంలో నేడు.. ఆయన కుమారుడు ఫెర్డినాండ్ బాంగ్‌బాంగ్ మార్కోస్ జూనియర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో నాటి పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వం దానిని తగ్గించడానికి, దేశంలో సాధారణ పరిస్థితిని తీసుకురాడానికి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ ప్రజల నుంచి దీనికి స్పందన లేదు. దీనిని దేశ ప్రజలు.. కేవలం టైమ్ పాస్‌గా చూస్తున్నారు. నేపాల్ తిరుగుబాటులా ఈ ఆదివారం ఫిలిప్పీన్స్‌లో జరిగే నిరసనలు.. ఏమైనా ఉంటాయా అని ప్రపంచ దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
READ ALSO: Pakistan – China: ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు