PFI: ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మికసంస్థలు టార్గెట్గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాడులకు పాల్పడవచ్చన్న సమాచారం మేరకు ఇంటిలిజెన్స్ బృందం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా యువకులను రెచ్చగొడుతుందన్న నెపంతో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై బ్యాన్ విధించింది. దీనిపై ఆ సంస్థ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, నిషేధం విధించడం దారుణమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులలో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని, దీంతో తెలంగాణా ఇంటిలిజెన్స్ అప్రమత్తమైంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కార్యకలాపాలపై అలర్ట్ గా ఉండాలని, పీఎఫ్ ఐ దాని అనుబంధ సంస్థల పై నిఘా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. కాశ్మీర్ పండిట్ హత్య
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో గతంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. పీఎఫ్‌ఐ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో దేశవ్యాప్తంగా 45 మంది నేతలను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది 12న పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు కూడా పీఎఫ్‌ఐ కుట్ర చేసినట్లు గుర్తించింది.
దీంతో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఇచ్చిన అంశాలను కేంద్ర హోంశాఖ క్షుణ్నంగా పరిశీలించింది. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా కార్యకలాపాలు నడిపిస్తుందనే కారణంతో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధంపై ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పీఎఫ్‌ఐపై బ్యాన్ విధించినట్లుగానే ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్‌ఐపై నిషేధం విధించడాన్ని ఆయన ఖండించారు.