NTV Telugu Site icon

Petrol Rates: సమస్యలు పరిష్కరించాలని మే31న నో పర్ఛేజ్ డే

Fuel Price Petrol Price Congress

Fuel Price Petrol Price Congress

తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు.

మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్. ఏపీ కంటే పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో ఏపీ ఆదాయం మొత్తం పక్క రాష్ట్రాలకు పోయేది. చాలా మంది ఏపీ దాటే వరకు సరిపడా ఆయిల్ ఇక్కడ కొట్టించుకుని, పక్క స్టేట్ వెళ్ళగానే ట్యాంక్ ఫుల్ చేయించుకునే వారు. దీంతో సేల్స్ లేక ఆయిల్ డీలర్స్ లబోదిబోమంటున్నారు. మరో పక్క లోకల్ గా వాహనదారులు కూడా లీటర్ పెట్రోల్ 120 రూపాయలు పెట్టి కొట్టించలేక నానా అవస్థలు పడ్డారు.

కోవిడ్ తర్వాత పైసా పైసా పెరుగుతూ పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా పెరిగిపోయాయి. దాంతో అన్ని చోట్ల నుండి ధరల భారంపై విమర్శలు రావటంతో రాష్ట్రం కేంద్రం మీదకు, కేంద్రం రాష్ట్రం మీదకు నెట్టుకుంటూ…. ఎట్టకేలకు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది .దాంతో పెట్రోల్ పై 9 రూపాయలు, డీజిల్ పై 7 రూపాయల భారం తగ్గింది. ఇది వాహనదారులకు ఉపయోగమే అయిన డీలర్స్ కు మాత్రం లక్షల్లో నష్టాన్ని తెచ్చిపెట్టింది.

ఒక్కసారిగా పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించటంతో ముందే ఎక్సైజ్ డ్యూటీ కట్టి భారీగా ఆయిల్ కొనుగోలు చేసిన పెట్రోల్ బంక్ లకు లక్షల్లో నష్టం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పెట్రోల్ బంక్ లకు 5 లక్షల నుండి పెద్ద పెట్రోల్ బంక్ లకు 20 లక్షల వరకు నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ టైం నుండి ఏదో రకంగా నష్టాలు తప్పటం లేదని…మొన్నటి వరకు ధరల భారం వల్ల నష్టం ఇప్పుడు ధరలు తగ్గించడం వల్ల నష్టం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గటం అందరికీ ప్రయోజనం అయినప్పటికీ ఇలా ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల కట్టి తీసుకుని వచ్చిన బంకులు నష్టాల్లో అమ్మాల్సి వస్తుందని మండిపడుతున్నారు..పెంచితే పైసా పైసా పెంచే ప్రభుత్వం ఎన్నికల కోసం ఇలా ఒక్కసారిగా తగ్గించడం బంక్ లకు ఇబ్బంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా 2017 లో వేతనాలు, విద్యుత్ బిల్లులు ప్రకారం 6నెలలకు ఒకసారి డీలర్ కమిషన్ పెంచాలని అపూర్వ చంద్ర కమిటీ చెప్పినప్పటికీ అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదని మండిపడుతున్నారు. ఒక్క పక్క బంక్ లు పెరిగిపోయి కొనుగోళ్లు తగ్గిపోయాయని దానికి తోడు ఇప్పటి నష్టాలు భరించలేరంటున్నారు. .ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని దాదాపు 16 రాష్ట్రాలు కలిపి ఈ నెల 31 నా నో పర్ఛేజ్ డే ప్రకటించాయి. అంటే డీలర్స్ వద్ద రోజు కొనే ఆయిల్ ను ఆ రోజు కొనడం మానేసి తమ నిరసనను తెలియ చేయనున్నారు..అంతే కాకుండా తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ కి ఆయిల్ కంపెనీలు రీఎంబర్స్ మెంట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Davos : ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ పెవిలియన్