NTV Telugu Site icon

Perni Nani: టీడీపీకి టికెట్‌ ఇచినప్పుడు వల్లభనేని పశువుల డాక్టర్‌ కాదా? దేవతల డాక్టరా..? కొడాలి సైంటిస్టా..?

Perni Nani Satires On Brs

Perni Nani Satires On Brs

Perni Nani: ఈ మధ్య గన్నవరం పాలిటిక్స్‌ మళ్లీ హీట్‌ పెంచాయి.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పుకున్నారు.. మరోవైపు.. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన వల్లభనేని వంశీపై, కొడాలి నానిపై తెలుగుదేశం నేతలు ఆరోపణలు గుప్పిస్తు్నారు.. వాటికి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. 2019లో గన్నవరం టికెట్ ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీ పశువుల డాక్టర్ కాదా? అప్పుడు దేవతల డాక్టరా? 2004, 2009లో టీడీపీ టికెట్ పై గెలిచినప్పుడు కొడాలి నాని మైక్రోసాఫ్ట్ ఇంజనీరా? ఇస్రో చంద్రయాన్ సైంటిస్టా? అంటూ టీడీపీ నేతలకు కౌంటర్‌ ఇచ్చారు. వంశీ 2014లో టీడీపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా పశువుల డాక్టరే అని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు మాట్లాడుతున్న ఆ నాయకుడు వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నారు అని విమర్శించారు.

వైసీపీలో ఉంటే కప్పులు కడుక్కునే వాడు, లారీ డ్రైవరా? మరి కప్పులు కడిగే వాడంటే ఇప్పటికీ చంద్రబాబు ప్యాంటు ఎందుకు తడుస్తోంది? అంటూ మండిపడ్డారు పేర్నినాని.. మోడీ కప్పులు కడగలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఓట్ల కోసం లారీ డ్రైవర్ల భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్నారు.. ప్రత్యర్థులను విమర్శించటానికి ఆ పేద వాళ్లను అవమానిస్తున్నాడు.. ఇది పెత్తందారి స్వభావం, కుల అహంకారం కాదా? అని విమర్శించారు. గుడివాడలో టీడీపీకి అభ్యర్థి పెట్టుకునే పరిస్థితి లేదన్న ఆయన.. లోకేష్ కు సిగ్గు శరం ఉంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్‌ చేశారు. లోకేష్ పనికి శుంఠ కావటం వల్లనే చంద్రబాబు దత్త పుత్రుడిని తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. తమ పాలనను తిరిగి తెస్తాం అని చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితి చంద్రబాబు, లోకేష్ ది అని సెటైర్లు వేశారు. అధికారం ఇస్తే జగన్ పథకాలను తెస్తాను అంటున్నాడు లోకేష్.. గతంలో హెరిటేజ్ పాలు, పెరుగు, నెయ్యి అమ్ముకోవడానికి పథకాలు పెట్టారు.. అన్నా క్యాంటీన్లు మూసేశారని అంటున్నారు. అసలు పెట్టింది ఎప్పుడు తీసేయటానికి? అని నిలదీశారు.

మొన్న ఎన్నికల్లో గెలిచింది వంశీనా? లోకేషా? అని ప్రశ్నించిన పేర్నినాని.. వంశీ టీడీపీకి వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నది ఎవరు? అని నిలదీశారు. ఇక, యువగళం పేరుతో లోకేష్ రాత్రుళ్ళు పాదయాత్ర చేస్తున్నాడు.. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున ఒంటి గంట వరకు తిరుగుతున్నాడు.. అది యువగళమా? యువ గంగాళమా? అని ఎద్దేవా చేశారు. పగలైతే ప్రజలు నిలదీస్తారని అర్థ రాత్రుళ్ళు తిరుగుతున్నాడా? యువగళం వల్ల పేదలకు కొంచెం మంచి జరుగుతోంది.. యువగళానికి వచ్చినందుకు వెయ్యో, రెండు వేలో వస్తున్నాయి వాళ్ళకు అని విమర్శించారు. గన్నవరంలో సభ పెట్టి ముఖ్యమంత్రిని, మా నాయకులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు.. పాదయాత్ర ఎలా చేయాలో రాజశేఖరరెడ్డి పాదయాత్ర వీడియోలు చూస్తే అర్థమవుతుంది.. జుగుప్సాకరంగా, అసహ్యంగా మాట్లాడటమే వీళ్ల రాజకీయం అని మండిపడ్డారు. జగన్ ఇస్తున్న పథకాలనే పేరు మార్చి వీళ్లు ఇస్తారట.. దీనికి మీరు రావటం ఎందుకు? లోకేష్ తాను మూర్ఖుడిని అంటున్నాడు.. మూర్ఖుడికి అధికారం ఇవ్వాలట.. బట్టలు ఊడదీస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నాడు లోకేష్.. ఇదీ టీడీపీ మ్యానిఫెస్టో అంటూ విమర్శించారు. మీ మాటలు విని మీ పెద్దవాళ్ల ఆత్మలు ఏడుస్తాయి అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.