Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారని ఆయన ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేదని మోడీ కూడా చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయటం కోసమే పాకులాడతాడని ఆయన అన్నారు. 2014లో జగన్‌కు ఇప్పటికి చాలా తేడా ఉందని.. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చిన సర్పంచ్‌లు.. అడ్డుకున్న పోలీసులు
అర్జునుడు అయితే ద్రౌపదిని కాపాడాలి అంటారని.. అర్జునుడికి, ద్రౌపదికి మధ్య సంబంధం ఏంటో వీళ్ళకు తెలియదని ఆయన విమర్శించారు. చిరంజీవి జనరంజక నటుడు అని.. చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషించారని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయమని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించ లేదా అంటూ ప్రశ్నించారు. రాంచరణ్ మాకు, బాబాయికి సంబంధం లేదని ఓ వేదిక పై మాట్లాడిన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మానవ సంబంధాల గురించి పవన్ కళ్యాణ్ చెప్పటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. షర్మిల అన్నతో విబేధించి అన్న శత్రువులతో చేతులు కలిపారని.. మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసిందని విమర్శించినా అదే కాంగ్రెస్ జెండా మోస్తున్నారన్నారు. తల్లిని తిట్టిన పార్టీకి పల్లకి మోస్తున్నాడు పవన్ కళ్యాణ్.. కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్‌ది అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. తన పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాడని మండిపడ్డారు.
2004 నుంచి జగన్ గురించి మొత్తం తెలుసు అంటున్నాడు బాలశౌరి.. ఇంత చెడ్డ వాడని తెలిస్తే ఎందుకు వైసీపీలోకి వచ్చావ్ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 2004లో తెనాలికి వెళ్ళింది ఎవరని ప్రశ్నలు గుప్పించారు. 2009లో నర్సరావుపేటకు పారిపోయింది ఎవరని.. 2019లో మచిలీపట్నంకు వెళ్లింది ఎవరు అని ప్రశ్నించారు. ఢిల్లీలో రాత్రి పది దాటిన తర్వాత ఎంత జుగుప్సాకరంగా కేవీపీ దగ్గర మాట్లాడావో తెలియదు అనుకుంటున్నావా అంటూ ఆయన చెప్పారు. పేర్ని నాని సర్వర్ ఉద్యోగం చేస్తున్నాడు అని చంద్రబాబు అంటున్నాడని ఆయన వెల్లడించారు. కార్యకర్తలకు భోజనం పెడితే అంత చులకనగా కనిపిస్తున్నామా అంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. సర్వర్లు మనుషులు కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని పేర్ని నాని విమర్శించారు.