Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు చెప్పేవన్నీ మాయ మాటలేనని.. కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైందన్నారు. సీఎం జగన్ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ సర్కారును కూలదోయడానికి కూటమి ఏర్పడిందని.. మాయమాటలతో ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముగ్గురు ఫోటోలతో కూటమి అని బయల్దేరాడని.. మేనిఫెస్టో నాటికి మూడు ఫోటోలు కాస్తా రెండు ఫోటోలయ్యాయన్నారు. సూపర్ 6 అంటూ ఇంటింటికీ పాంప్లెట్లు పంచారని.. ఇప్పుడేమో మేనిఫెస్టోకు బీజేపీ ఆర్ధిక అనుమతులు లేవంటున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటనల్లో ఇప్పుడు పవన్ ఫోటో మాయం చేశాడని ఆయన అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఫోటోలతో పాటు హామీలు కూడా ఒక్కొక్కటి మాయమవుతున్నాయని ఎద్దేవా చేశారు. నాలుగు వేల పెన్షన్ అంటూ ఇంటింటికీ తిరిగి ఊదరగొట్టారని పేర్ని నాని తెలిపారు. ఇప్పుడు సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి పోయిందని విమర్శించారు. ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో అసలు పెన్షనే లేకుండా ఎత్తేశారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయిందని విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడని.. కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలుపెట్టాడని ఆరోపించారు. 1994లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్‌పవర్ విద్యుత్, మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు రెండు రూపాయల కిలో బియ్యాన్ని వెంటనే ఐదున్నర రూపాయలు చేశాడన్నారు. వ్యవసాయ విద్యుత్‌లో హార్స్‌పవర్ రూ.50 ఉన్నదాన్ని రూ.650 చేశాడని విమర్శించారు. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడన్నారు. అంటే 1994 నుంచే మేనిఫెస్టోపై దగా చేయడం చంద్రబాబుకు అలవాటు అని విమర్శించారు. పెన్షన్ విషయంలో చంద్రబాబు, నిమ్మగడ్డలకు వృద్ధుల ఉసురు తగలకమానదన్నారు. చంద్రబాబు తన బంధువైన నిమ్మగడ్డతో కోర్టుల్లో కేసులు వేయించి పింఛన్ ఇంటికి ఇవ్వకుండా చేశారన్నారు. వాలంటీర్ల ద్వారా సాఫీగా పంచే పింఛను అందించకుండా వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యక్తి చంద్రబాబేనని ఆయన విమర్శించారు.
