పెప్పర్ స్ప్రే ప్రమాదకరమైన ఆయుధమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.పిటిషనర్ల ఆస్తిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారని ఆరోపించిన ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్, అతని భార్యపై క్రిమినల్ కేసును రద్దు చేయడానికి కర్ణాటక హైకోర్టు ఇటీవల నిరాకరించింది. సి కృష్ణయ్య చెట్టి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, అతని భార్యపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఏప్రిల్ 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఓ గొడవలో బాధితుడు రణదీప్ దాస్ పై సి కృష్ణయ్య చెట్టి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గణేష్ భార్య విద్యా నటరాజ్ పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. ఈ ఘటన పై బాధితుడు రణదీప్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. పోలీసులు గణేష్, అతని భార్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
READ MORE: Maharastra : ఆస్పత్రిలో రోగులకు మద్యం, గంజాయి సరఫరా.. ఎక్కడ చూసినా గబ్బు వాసన
కాగా.. విద్యా నటరాజ్ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే ప్రయోగించారని.. అక్కడ జరిగిన గొడవలో తాను కూడా గాయపడినట్లు పేర్కొంటూ… ఈ కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 100 ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ హక్కు ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను కొట్టేస్తూ.. ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్పులు, కత్తిపోట్లు లేదా మరేదైనా ఆయుధంతో గాయపరిచేందుకు ప్రయత్నిస్తే అది నేరమని.. కోర్టు తెలిపింది. పెప్పర్ స్ప్రే ప్రమాదకరమైన ఆయుధం అనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. అమెరికా కోర్టును కూడా కోర్టు ఉదహరిస్తూ.. 2018లో ఒక కేసులో పెప్పర్ స్ప్రేని చాలా ప్రమాదకరమైన ఆయుధంగా అభివర్ణించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ, జస్టిస్ నాగప్రసన్న ఆత్మరక్షణ పిటిషన్‌ను అంగీకరించేందుకు నిరాకరించింది. విద్య ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, అయినప్పటికీ ఆమె పెప్పర్ స్ప్రే ఉపయోగించారంది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.