తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా.. ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టీడీపీకి అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు హయంలో రాజధాని ప్రాంతంలో మూడు అద్భుతమైన యూనివర్సిటీలను తీసుకొచ్చారు. కానీ, ప్రస్తుతం టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది అని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Read Also: Minister Seethakka: దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ.. దేవుళ్లకే శఠగోపం పెట్టింది..
చంద్రబాబు, లోకేష్, నేను ఉన్నంత వరకు ఈ అమరావతిని అడుగు కూడా కదిలించలేరని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు ప్రాంతంలో పుట్టిన వాడిని నేను.. ఈ బెదిరింపులు, బాంబులు చూస్తూనే పెరిగాను.. అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మాత్రమే నా సొంత గడ్డపై అడుగు పెట్టానన్నారు. గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే 30 ఏళ్లలో నా వల్ల ఈ ప్రాంతానికి మంచే జరుగుతుందని హామీ ఇస్తున్నానని పెమ్మసాని పేర్కొన్నారు.
Read Also: Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!
ఇక, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడితో పాటు అంతకు ముందు ఉన్న సీఎంలు తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసమే అన్నారు. బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. టీడీపీ హయంలో ఉండగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటు పడిందని నాదెండ్ల మనోహర్ అన్నారు.