గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని చూసి ఒక్కసారి తనకు ఓటు వేస్తే.. ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. ఇక, క్రోసూరు మండలం బయ్యవరంలో జనసేన పార్టీకి సంబంధించిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బయ్వవరం గ్రామంలో గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానన్నారు. 2019లో బయ్వయరంలో తనకు మంచి మెజారిటీ వచ్చిందని.. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను నమ్మి గెలిపిస్తే బయ్యవరం అభివృద్ధికి అవసరమైన అన్ని పనులు చేస్తానని హామీ ఇచ్చారు. బయ్యవరం అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానన్నారు. ఎన్నికల వరకు తన కోసం నిజాయితీగా పని చేస్తే.. ఆ తర్వాత ఐదేళ్లు తాను నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తానని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు.
Read Also: IPL 2024: హార్థిక్ పాండ్యాను పట్టించుకోని ఆకాశ్ మధ్వాల్
ఇక, రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని.. చంద్రబాబు వస్తే అరాచక పాలన వస్తుందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట మండలం చల్లగరిగ, తాడువాయి, సండ్ర తండా, బంగారు తండా గ్రామాల్లో పర్యటించారు. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ అందడంతో.. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు.. ఆయనకు పూలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. చల్లగరిగలో గత ఐదేళ్లలో సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అందించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా.. ఇంత పెద్ద మొత్తం పేదల ఖాతాల్లో పడ్డాయని అడిగారు. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి.. వారి కుటుంబాలు బాగుండాలనే.. లక్ష్యంతో జగన్ పాలన కొనసాగుతుందన్నారు. పొరపాటున చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీ అరాచకాలు మొదలవుతాయన్నారు. గతంలో రుణామాఫీ, జాబులు అంటూ బూటకపు మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నారు.. వారిని నమ్మితే ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారని హెచ్చరించారు. గత ఐదేళ్లలో తన పాలనలో జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక ఓటు ఎమ్మెల్యేగా తనకు, మరో ఓటు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ కి వేస్తే.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు పేదల జీవితాలు మరింత బాగుపడతాయని.. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వెల్లడించారు.