NTV Telugu Site icon

Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై పవన్ సెటైర్లు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సెటైర్లు వేశారు.. సోషల్‌ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా..? లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్.

మరోవైపు రుషికొండ దగ్గర టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డుగా బారికేడ్లు పెట్టి వాహనాలను నిరోధించారు. దీంతో గండిబాబ్జీ, పోలీసులు మధ్య కొంత సేపు వాగ్వివాదం జరిగింది. గీతం యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందు టీడీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమి గీతం ఆధీనంలో ఉందని ఈ ఏడాది జనవరిలో యంత్రంగం గుర్తించింది. అప్పుడే కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్మాణాలను తొలగించారు. ఈ చర్యలపై న్యాయస్థానంను ఆశ్రయించింది యాజమాన్యం. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో రెవెన్యూ యంత్రంగం రంగంలోకి దిగింది. అర్ధరాత్రి మెషినరీ, ముళ్ల కంచెలతో సిబ్బంది గీతంకు చేరుకున్నారు. ఉదయానికి ప్రభుత్వ ఆస్తులుగా పరుగణిస్తున్న భూములకు కంచె వేసి, బోర్డులు ఏర్పాటు చేశారు. ఎటువంటి అందోళనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీగా పోలీసులు మోహరించారు. గీతం వైపు వెళ్లే రహదారులు మూసివేశారు.ఈ క్రమంలో యూనివర్సిటీ దగ్గరకు కార్యకర్తలతో కలిసి వెళ్లే ప్రయత్నాలను మాజీ ఎమ్మెల్యే చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇక, గీతం యూనివర్సిటీ ఘటనపై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా జగన్ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.. గీతం యూనివర్సిటీ గోడలు కూల్చడం దుర్మార్గపు చర్య అన్నారు.. కోడి కత్తి డ్రామాని న్యాయస్థానాలు బట్ట బయలు చేయడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ విధ్వంసానికి పూనుకున్నాడన్న ఆయన.. చదువుల తల్లి గీతం యూనివర్సిటీపై జగన్ రెడ్డికి అంత కక్ష ఎందుకు ? అని మండిపడ్డారు. టీడీపీ నేతల ఆస్తులు కూల్చడం, అక్రమ కేసులు పెట్టడం జగన్ రెడ్డికి వ్యసనంగా మారిపోయిందని విమర్శించారు. నియంతలు, నికృష్టులు పాలకులైతే పరిపాలన ఇలానే ఉంటుందని ఫైర్‌ అయ్యారు. ప్రతిపక్షనేతల ఆస్తులు కూల్చుతున్న జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చడం ఖాయమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కి, వైసీపీ నేతలకు పరివర్తన పాఠాలు నేర్పిస్తాం అని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.