Pawan Kalyan: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, సిబ్బంది, ప్రజా ప్రతినిధులకి శిక్షణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది.
ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు జత చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికీ, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అందించేందుకు తగిన ఆదేశాలు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.