NTV Telugu Site icon

Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!

Pawan Kalyan Pm

Pawan Kalyan Pm

ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం చెప్పారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ఓట్లు వస్తాయా?, రావా? అనేది ఆలోచన చేయలేదు. దేశ అభివృద్ధే లక్ష్యంగా కర్తవ్య నిర్వహణలో ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం ‘పీఎం-జన్ మన్’ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) ఉండే ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే పీఎం-జన్ మన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.555.61 కోట్ల నిధులతో 612.72 కిమీ మేర రహదారులు నిర్మిస్తున్నాము. ఇవన్నీ పీవీటీజీ ఆవాసాలను అనుసంధానించే రహదారులే. వీటి ద్వారా ఏడు జిల్లాల్లో 239 పీవీటీజీ ఆవాసాలకు రహదారులు ఏర్పరచగలుగుతున్నాము’ అని తెలిపారు.

‘239 ఆవాసాలకు రహదారులు మూలంగా సుమారు 50 వేల మందికి రోడ్డు సౌకర్యం వస్తుంది. వారు మనకు ఓట్లు వేస్తారా లేదా అనే ఆలోచన ఎక్కడా చేయలేదు మన ప్రధాని గారు. అదే మొత్తాన్ని ఓట్లు వస్తాయి అనే చోట వెచ్చించవచ్చు. ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో మోడీ గారు ముందడుగు వేస్తున్నారు. ఆ స్ఫూర్తితోతోనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ మూడు నెలల పాటు రాష్ట్రంలో పర్యటించి రూపొందించిన నివేదికను అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాము’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.

Also Read: PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్‌-2 టార్గెట్!

‘ఆపరేషన్ సిందూర్, అందుకు దారి తీసిన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఇటువంటి దశలో కూడా ప్రజల రక్షణతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి ఆలోచన చేశారు. కుల గణన చేపట్టడం అనేది ఎంతో అవసరం. దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు మనకు తెలుస్తాయి. వారికి జీవనోపాధుల మెరుగుదలకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఏ పథకాలు తీసుకురావాలో పాలన వర్గాలకు ఒక స్పష్టత వస్తుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.