Site icon NTV Telugu

Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!

Pawan Kalyan Speech

Pawan Kalyan Speech

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. నెల్లూరులో తనకు ఇంటర్ సీటును దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పించారని తెలిపారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి.. ప్రకాశం, నెల్లూరు సహా ఐదారు జిల్లాలో తిరిగానని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. సైమన్ కమిషన్‌కి ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు అని పవన్ కొనియాడారు. ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి ఏపీ డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్‌ ప్రసంగించారు.

‘అపారమైన ఖనిజాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అయినా ప్రకాశం జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆవేదన చెందుతున్నారు. ఒంగోలులో రెండు సంవత్సరాలు, కనిగిరిలో ఆరు నెలలు ఉన్నాం. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య వలన అక్కడి నుంచి వెళ్లిపోయాం. జల్ జీవన్ పనులు మొదటి ప్రయారిటీ ప్రకాశం జిల్లాకి ఇచ్చాం.గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాని నిర్లక్ష్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గత పాలకులకు రౌడీయిజం, గుండాయిజం చేయాలనే భావన ఉంది. రౌడీలకు, గుండాలకు భయపడితే మనం రాజకీయాలు చేయలేము. వస్తాం, మీ అంతు చూస్తామంటే.. మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేమూ చూస్తాం. వ్యక్తి గతంగా నాకు వైసీపీ నేతలపై కక్ష లేదు. సగటు మధ్యతరగతి మనిషికి భయభ్రాంతులకు గురి చేస్తే దాన్ని ఎదుర్కొని ఇక్కడదాకా వచ్చాం’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.

‘మీకు 151 సీట్లు వచ్చి.. నేను రెండుచోట్ల ఓడిపోయినప్పుడే కదా మిమ్మల్ని ఎదుర్కొంది. మీలాంటి వాళ్ళని తట్టుకోవాలంటే.. నా గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి. నేను సినిమా నుంచి వచ్చిన వాడినే కానీ.. సినిమా డైలాగులు చెప్పను. కుతికలు కోసేస్తాం… మెడకాయలు కోసేస్తాం అంటే మేమైనా చొక్కా విప్పి చూపిస్తామా. సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటా. సింహం గడ్డం గీసుకుంది.. నేను గీసుకోలేదంటే సీనప్ చేయడానికే. సింహం నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. వైసీపీ నాయకులు అద్భుతమైన పాలన చేసి ఉంటే 11 సీట్లు వచ్చేవి కాదు. మాది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు.. తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. 11 సీట్లు వచ్చిన పార్టీగా వైసీపీని గౌరవిస్తాం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read: Modugula Venugopala Reddy: 2029 ఎన్నికలలో మొట్టమొదట గెలిచేది దేవినేని అవినాషే!

‘చంద్రబాబు సారధ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో తప్పు ఒప్పులు ఉంటే చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. అంతే కానీ మేం కుతికలు కోస్తాం అంటే.. తాటాకు చప్పుళ్ళకి మేం భయపడం. గత వైసీపీ ప్రభుత్వంలో 26 వేల కోట్లు జల్ జీవన్ మిషన్ పనులకి కేంద్రం ఇస్తామంటే.. నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ ఖర్చు చేసిన నాలుగు వేల కోట్లు కూడా వృధా అయ్యాయి. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి జల్ జీవన్ మిషన్ పనులకి నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పింది. నేను, సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపితే జల్ జీవన్ మిషన్ పనులకి మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చాక ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం ఖర్చు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇది. ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలు గెలిపించడం వలన కేంద్రానికి అది ఆక్సిజన్ అయ్యింది. అందువల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి. దేవాదాయ, అటవీ శాఖ, ఖాళీగా కనిపించిన భూములపై గత ప్రభుత్వ పెద్దలు వాలిపోయారు. గత ప్రభుత్వంలో ఆక్రమణకి గురైన భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచిన నాయకులు ప్రజలకు ఉపయోగపడాలి. డబ్బులు పెట్టకపోతే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరికొకరు గౌరవించుకోవాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబుని జైల్లో పెడితే కొంతమంది జనసేన నాయకులు ఏదో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ అని జనసేన నాయకులకు చెప్పాను. కూటమి అంటే పిడికిలి.. ఏ వేలు లేకపోయినా ఏమీ చేయలేం, ఏకలవ్యుడు పరిస్థితి అవుతుంది. 15 సంవత్సరాలు నిలబెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నా పార్టీ, కూటమి సంక్షేమం కంటే ప్రజల సంక్షేమం నాకు ముఖ్యం. అధికారం నుండి వెళ్లిపోయిన గత పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి’ అని పవన్ సూచించారు.

Exit mobile version