తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను అని పవన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Also Read: PBKS vs RCB: పంజాబ్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్.. కలవరపెడుతున్న కోహ్లీ గణాంకాలు!
‘స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. నారా చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత టీడీపీ ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తొలి మహానాడు సందర్బంగా 12వ సారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ‘సైబరాబాద్’గా మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షించారు. 1999లో “ఆంధ్రప్రదేశ్ విజన్ 2020” పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు మరియు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపచేశారు. ఆయన అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో, ఈ నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.
