వినాయక చవితి పండగ పూట కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చరణ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Rayachoty Murder: రాయచోటిలో దారుణం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి! కారణం ఏంటంటే?
‘మూలపేట గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడి మృతి బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్ ఆడుకొనేందుకు పోల్స్ నిలబెడుతున్న సమయంలో విద్యుతాఘాతం వల్ల ఏడిద చరణ్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడని తెలిసి చింతిస్తున్నాను. చరణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడమైనది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు యువకులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశాను. క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పమని సూచించాను. క్రీడా ప్రాంగణాల్లో కావచ్చు, పని ప్రదేశాల్లో కావచ్చు.. పోల్స్ లాంటి నిలిపేటప్పుడు, ఎత్తైన ప్రదేశాల్లో నిర్మాణాల్లాంటివి చేపట్టినప్పుడు విద్యుత్ షాక్‌కు ఆస్కారం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ దశలోనూ అశ్రద్ధ వహించవద్దు. ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులకు ఎంతో వేదన కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
