JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్‌!

Janasena Youth Wing Jai Kottu

Janasena Youth Wing Jai Kottu

JanaSena Youth Wing Theme Song: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరు పెట్టి.. లోగోను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోతో పాటు గేయాన్ని కూడా ఆవిష్కరించారు.

యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పార్టీ యువజన విభాగం ద్వారా యువతను మరింతగా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, వారికి బాధ్యతలు అప్పగించడం లక్ష్యంగా ఈ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన యువజన విభాగం నేపథ్య గీతంకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రెండు, మూడు నెలలుగా పవన్ కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారన్నారు. అయినప్పటికీ పవన్ ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారన్నారు. పార్టీకి, రాష్ట్ర ప్రజలకు తన వంతు సేవ అందించాలనే ఆలోచనతో పవన్ ఎప్పుడూ ముందుంటారని మంత్రి నాదెండ్ల అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన నాదెండ్ల.. అప్పటి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ కూటమితో కలిసి కీలకంగా పనిచేసిందని చెప్పారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని.. కూటమి విజయానికి జనసేన శ్రేణులు కృషి చేశాయని పేర్కొన్నారు.

పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ ఆవిష్కరణతో జనసేనలో యువతకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. పార్టీ కార్యకలాపాల్లో యువతను చురుకుగా భాగస్వాములను చేయడంతో పాటు భవిష్యత్‌లో వారికి నాయకత్వ అవకాశాలు కల్పించే దిశగా ఈ విభాగం ఉపయోగపడుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జై కొట్టు’ యువజన విభాగం ఆవిష్కరణ జరగడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పిఠాపురంలో జరిగిన ఈ కార్యక్రమంకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.