NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కూడా ఆ పదం కలసి వచ్చేనా!?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఈ యేడాది ఆరంభంలోనే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ చిత్రాలతో ‘వీర’ అన్న పదానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ రెండూ సంక్రాంతి కానుకలుగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నాయి. దాంతో ఈ సంవత్సరం ‘వీర’ అన్న పదానికి భలే క్రేజ్ ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న జానపద చిత్రం ‘హరి హర వీరమల్లు’లోనూ ‘వీర’ అన్న పదం చోటు చేసుకుంది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

Chiru-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలసి నటించాల్సిందే!

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ‘పాన్ ఇండియా మూవీ’గా రానుంది. ప్రస్తుతానికి ఈ సినిమా మార్చి 30న విడుదల కానుందని వినిపిస్తోంది. ఇప్పటి నుంచి అప్పటి దాకా టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరి సినిమా విడుదల కావడం లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మార్చి 30న వస్తే నిస్సందేహంగా వీరవిహారం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ కు సక్సెస్ అంతగా లేని మాట వాస్తవమే. ఆరేళ్ళ క్రితం బాలకృష్ణతో క్రిష్ తెరకెక్కించిన పీరియడ్ మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తరువాత ఆ స్థాయి సక్సెస్ లభించలేదు. ‘హరి హర వీరమల్లు’కు ముందు పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజతో క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ బాగుందనే టాక్ సంపాదించినా, జనాన్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో సినిమా ఏ మాత్రం బాగుందన్న టాక్ వచ్చినా, రికార్డులు బద్దలు కాకమానవని అభిమానులు భావిస్తున్నారు. పైగా ఈ యేడాది మొదట్లోనే చిరు, బాలయ్య ‘వీర’ సెంటిమెంట్ కు ప్రాణం పోశారు. అదే తీరున ‘వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారని అభిమానుల అభిలాష! ఆ తరువాత కూడా మరో రెండు వారాల పాటు టాప్ స్టార్స్ సినిమాలేవీ లేకపోవడం కూడా ‘వీరమల్లు’కు కలసి వచ్చే అంశమే అని తెలుస్తోంది. రెండు వారాల తరువాత చిరంజీవి ‘భోళాశంకర్’ వస్తుందని సమాచారం. ఏది ఏమైనా ‘వీర’ పదం చోటు చేసుకున్న ‘హరి హర వీరమల్లు’ కూడా గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందనే అభిమానుల ఆశ!

Show comments