Pat Cummins Said I fell in love with ODI format once again: వరల్డ్‌కప్ 2023 విజయంతో తాను మరోసారి వన్డే ఫార్మాట్ ప్రేమలో పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఫైనల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడటంతో నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌గా మారిపోయిందని, అది తనకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పాడు. టాస్ కోసం వెళ్లిన సమయంలో స్టేడియంలో 1.30 లక్షల నీలి జెర్సీలను చూశానని, ఆ అనుభవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోను అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆసీస్.. ప్రపంచకప్ 2023 ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఫైనల్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసేలా కనిపించాడు. అతడి వికెట్ పడటంతో మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌గా అయిపొయింది. అది నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ ప్రపంచకప్ విజయంతో మరోసారి వన్డే ఫార్మాట్ ప్రేమలో పడ్డా. మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కీలకమైందే. ద్వైపాక్షిక సిరీస్‌లతో పోలిస్తే.. ప్రపంచకప్ పూర్తి భిన్నం. ప్రపంచకప్‌కు అద్భుతమైన చరిత్ర ఉంది. ఇది చాలా కాలం కొనసాగుతుందనుకొంటున్నా. గత రెండు నెలల్లో అద్భుతమైన మ్యాచ్‌లు జరిగాయి. వాటికి చరిత్రలో కచ్చితంగా స్థానం ఉంటుంది. ఈ సంవత్సరంలో నాకు ఇవే అద్భుతమైన క్షణాలు. నాకు ఈ ఏడాది చాలా ముఖ్యమైంది. ఎప్పటికీ గుర్తుండి పోతుంది’ అని తెలిపాడు.
Also Read: ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
‘నా కుటుంబం ఈ మ్యాచ్‌ను ఇంటివద్ద చూసింది. ఇప్పుడే మా డాడ్ నుంచి మెసేజ్ వచ్చింది. మా డాడ్ చాలాసార్లు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రపోకుండా ఉండాల్సి వచ్చింది. అందరికంటే ఆయన చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్లేయర్స్ ఈ క్షణాల కోసం కుటుంబాలకు చాలా కాలం దూరంగానే ఉన్నారు. నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటా. కానీ ఈ ఉదయం కాస్త ఒత్తిడి అనిపించింది. హోటల్‌లో నుంచి చూస్తే.. భారీ సంఖ్యలో నీలి రంగు జెర్సీలు మైదానంలో కనిపించాయి. టాస్ కోసం వెళ్లినపుడు 1.30 లక్షల భారత ఫాన్స్ ఉన్నారు. అది అద్భుతం. ఆ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అయితే మా ఆధిపత్యం ఉండడంతో.. ఫాన్స్ ఎక్కువ సందడి చేయలేదు’ అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.