ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘మ్యాడ్’ మూవీ ఒకటి.. చిన్న సినిమా గా వచ్చిన మ్యాడ్ మూవీ సంచలన విజయం సాధించింది. మ్యాడ్ మూవీలో స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , రామ్ నితిన్ మరియు సంగీత్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.. అక్టోబరు 6న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా ఓటీటీ లో కూడా ట్రెండింగ్ గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు విశ్లేషణ ఇచ్చారు.పరుచూరి పాఠాలు’ పేరుతో యూట్యూబ్ వేదికగా ఆయన సినిమాలను విశ్లేషిస్తారనే విషయం తెలిసిందే.
తాజాగా ‘మ్యాడ్’ మూవీ పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.”నా టీమ్ మ్యాడ్ సినిమాని చూడమని చెప్పగా ఆసక్తిగా చూశా. సుమారు రెండు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. దర్శకుడు చాలా ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాన్ని చూస్తుంటే ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ చిత్రం గుర్తొచ్చింది. ఇది కూడా కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో రూపొందిందే. ‘మ్యాడ్’ యువతను బాగా ఆకర్షించి ఉంటుంది. పెద్దలకు వారి కాలేజీ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉంటాయి. నేనూ నాటి సంగతులు గుర్తు చేసుకున్నాను.ముగ్గురు ప్రధాన పాత్రల పేరులోని ఫస్ట్ లెటర్ కలిపితే వచ్చేదే MAD(మనోజ్, అశోక్, దామోదర్). ఇది దర్శకుడి టెక్నిక్ అని తెలుస్తుంది.. యువతరం, ప్రేమ మరియు కాలేజీ.. ఇలా ఏదో ఒక ఇతివృత్తంతో టైటిల్ పెట్టుకోవచ్చు. కానీ, ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ‘మ్యాడ్’ అని పెట్టారని నేను అనుకుంటున్నాను.”కథ చిన్నదేగానీ చీటింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు అలరించాడు. ఇది స్క్రీన్‌ప్లే డామినేటెడ్ ఫిల్మ్. స్క్రీన్‌ప్లేతో సినిమాని దర్శకుడు పరిగెత్తించారు అందుకే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడని పరుచూరి తెలియజేశారు.