Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!

Parawada Pharma City

Parawada Pharma City

అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని అధికారులు వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

×
×
Ad

ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే పరిశ్రమలో జరిగిన పేలుడు లేదా సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ ఘటనతో ఫార్మాసిటీ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.