వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా శివకార్తికేయన్ తన సినిమా విడుదల తేదీని మార్చి, దళపతి విజయ్‌తో నేరుగా తలపడేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ . సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే, డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు నాలుగు రోజుల ముందే, అంటే జనవరి 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే,
దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9న విడుదలవుతుండగా, సరిగ్గా ఒక్క రోజు గ్యాప్‌లోనే శివకార్తికేయన్ బరిలోకి దిగుతుండటం చర్చనీయాంశమైంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వెనువెంటనే వస్తుండటంతో థియేటర్ల సర్దుబాటు విషయంలో పెద్ద పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో ఇది విజయ్ సినిమా వసూళ్ల పై ప్రభావం చూపుతుందేమో అన్న ఆందోళనతో సోషల్ మీడియాలో ఇరు హీరోల అభిమానుల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది.