Gowru Charitha Reddy: పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ప్రచారం ఉధృతం చేశారు. 2014లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2019 లో వైసీపీకి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు గౌరు చరిత రెడ్డి. కొన్నాళ్లుగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యార్టీ, సూపర్ సిక్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టారు గౌరు చరితరెడ్డి. ఈసారి అవకాశం ఇస్తే…ఓర్వకల్లు కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని..అలాగే, హంద్రీనీవా కాల్వనుంచి కల్లూరు మండలంలోని చెరువులు నింపుతామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం చేపట్టి ఓర్వకల్లు మండల ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామని, అలగనూరు, గోరకల్లు రిజర్వాయర్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామని, పాణ్యం పరిధిలోకి వచ్చే కర్నూలు నగరపాలక సంస్థలోని 16 వార్డులకు నిత్యం తాగునీరు అందించేలా వాటర్ ట్యాంక్ నిర్మాణం వంటి తదితర హామీలను ఇస్తూ.. మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి, ఎమ్మెల్యే గెలిపించమంటూ ప్రజలను కోరుతున్నారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను క్షేత్రస్థాయిలో కలుపుకుని పోతూ, భర్త నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, కుమారుడు గౌరు జనార్థన్ రెడ్డి తదితర కుటుంబసభ్యుల సహకారంతో ఎన్నికల ప్రచారంలో ముందుకుసాగుతున్నారు గౌరు చరితరెడ్డి.