చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే నీరసం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ‘పంజీరీ లడ్డూ’ ఒక అద్భుతమైన వింటర్ సూపర్ ఫుడ్. వేయించిన గోధుమ పిండి, పెసర పప్పు పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ , బెల్లం కలయికతో తయారయ్యే ఈ లడ్డూ శరీరానికి లోపలి నుండి వెచ్చదనాన్ని, కావాల్సిన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇది ఒక వరమని చెప్పాలి. ప్రసవం తర్వాత త్వరగా కోలుకోవడానికి, ఎముకల బలానికి.. బాలింతల్లో పాలు పెరగడానికి ఈ పోషకాహార మిశ్రమం ఎంతో సహాయపడుతుంది. మెదడు చురుకుదనాన్ని, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
దీని తయారీ విధానం :
ముందుగా నెయ్యిలో పెసర పప్పు పొడి, గోధుమ పిండిని సుమారు గంట పాటు దోరగా, కమ్మని సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో పొడి చేసిన మఖానా, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కలిపి వేయించి, మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత బెల్లం తురుము చేర్చాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు బెల్లం కలిపితే లడ్డూ ఆకృతి సరిగ్గా రాదని గుర్తుంచుకోవాలి. ఇలా తయారైన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుని, రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే చలికాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ముఖ్య గమనిక: ఇందులో క్యాలరీలు (సుమారు 150-200) ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అతిగా తినకుండా రోజుకు ఒక లడ్డూ మాత్రమే తీసుకోవడం మంచిది.